UK Covid Cases Today: బ్రిటన్లో కొవిడ్ వ్యాప్తి కలవరపెడుతోంది. బుధవారం ఒక్కరోజే యూకేలో అత్యధికంగా లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల్లో దేశంలో 6, 43, 219 కేసులు వెలుగుచూసినట్లు యూకే హెల్త్ ఏజెన్సీ వెల్లడించింది.
ప్రపంచదేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. బుధవారం యూకేలో 1,06,122 కేసులు నమోదయ్యాయి. 140 మంది మృతిచెందారు. అయితే.. కొవిడ్ సమయంలో ఆరోగ్య సిబ్బంది పనితీరును ప్రశంసిస్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిస్టమస్ నేపథ్యంలో సిబ్బంది బూస్టర్ డోసు పంపిణీపై దృష్టి పెట్టిందని అన్నారు. అయితే.. కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ క్రిస్టమస్ సంబరాలు జరుపుకోవొచ్చని జాన్సన్ చెప్పడం గమనార్హం.
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ బూస్టర్ డోసు తీసుకోవాలని కోరుతూ బోరిస్ జాన్సన్ ట్వీట్ చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ప్రజాప్రతినిధులు సైతం కోరారు.
ఐసోలేషన్ వ్యవధి తగ్గింపు..
UK Isolation Rules: కొవిడ్-19 సోకిన వారు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన కాలవ్యవధిని తగ్గించింది బ్రిటన్ ప్రభుత్వం. క్వారంటైన్ వ్యవధిని 10 నుంచి 7 రోజులకు తగ్గించింది. అయితే.. కొవిడ్ సోకిన వారికి పరీక్షల్లో వరుసగా ఆరో రోజు, ఏడో రోజు నెగెటివ్ వస్తేనే ఈ నిబంధన వర్తిస్తుందని బ్రిటన్ హెల్త్ సెక్రటరీ సాజిద్ జావీద్ బుధవారం తెలిపారు. యూకే హెల్త్ ఏజెన్సీని సంప్రదించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు జావీద్ వివరించారు. కొవిడ్ మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న బాధలను తగ్గించేందుకే ఇలా చేశామన్నారు.
లాక్డౌన్ ఉండదు..
Australia Covid Cases: కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేసే పరిస్థితి రాకముందే ప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరమని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ అన్నారు. లాక్డౌన్ దిశగా వెళ్లే పరిస్థితి తెచ్చుకోవొద్దని ప్రస్తుతం లాక్డౌన్ పెట్టే ఉద్దేశం కూడా లేదని తెలిపారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ఇదీ చదవండి: