ఈ నెలలో జరిగే ఐరోపా సమాఖ్య(ఈయూ) ఎన్నికల్లో తప్పకుండా పాల్గొనాలని బ్రిటన్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించుకుంది. ఈయూ ఎన్నికల కంటే ముందుగా బ్రెగ్జిట్ ఒప్పందం పార్లమెంటులో ఆమోదం పొందే అవకాశం లేనందున ఆ నిర్ణయానికి వచ్చింది థెరిసా మే ప్రభుత్వం.
ఈ నెల 23న ఐరోపా సమాఖ్యకు ఎన్నికలు జరగనున్నాయి. ఈయూ నుంచి వైదొలగాలని బ్రిటన్ ప్రజలు బ్రెగ్జిట్ తీర్మానానికి ఓటు వేసి దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తుంది. ఇప్పుడు మరోసారి ఓటింగ్లో పాల్గొననున్నారు ఆ దేశ ప్రజలు.
బ్రిటన్ ప్రధాని థెరిసా మే నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ... 751 స్థానాలు ఉన్న యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో పాల్గొనకూడదని భావించింది. అయితే ఎన్నికల కంటే ముందు బ్రెగ్జిట్ ఒప్పందం ఆమోదం పొందే వీలులేనందున పాల్గొనక తప్పదని నిర్ణయించుకుంది.
థెరిసా మే ప్రతిపాదించిన బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ చట్టసభ సభ్యులు పార్లమెంటులో పలుమార్లు తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణ తేదీ మార్చి 29 నుంచి అక్టోబర్ 31కు వాయిదా పడింది.
ఇదీ చూడండి: ప్రకృతి కోసం మోదీతో ఒబామా దోస్తానా..!