అఫ్గానిస్థాన్‌లో హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్న వేళ ఆ దేశాన్ని తక్షణమే విడిచి వెళ్లాలని తమ పౌరులకు సూచించింది యునైటెడ్ కింగ్డమ్ (యూకే). అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలిన నాటి నుంచి తాలిబన్లు పేట్రేగిపోతున్నారు. దీంతో అక్కడ భద్రత పరిస్థితులు దిగజారిపోతున్నాయని బ్రిటిష్ పౌరులను అప్రమత్తం చేసింది యూకే. నిష్క్రమణ ప్రణాళికల కోసం రాయబార కార్యలయాన్ని సంప్రదించాలని పేర్కొంది.
"అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉంది. దాడి చేసే పద్ధతులు వృద్ధి చెందాయి. కాబుల్‌లో పశ్చిమ దేశాల ప్రయోజనాలకు పొంచి ఉన్న ముప్పును ప్రజలు గమనించాలి. అఫ్గాన్ వ్యాప్తంగా అపహరణలు జరిగే ప్రమాదం ఉంది."
-యునైటెడ్ కింగ్డమ్
తమపై జరుగుతున్న రాకెట్ దాడులకు ప్రతీకారంగా ప్రభుత్వ నేతలు, అధికారులను తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రభుత్వ మీడియా, సమాచార శాఖ ఉన్నతాధికారి దవాఖాన్ మీనాపాల్‌ను శుక్రవారం హతమార్చారు. అంతక్రితమే ఆ దేశ రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్‌పై బాంబు దాడి జరపగా ఆయన త్రుటిలో తప్పించుకున్నారు.
ఇదీ చూడండి: సైన్యం దాడిలో 94 మంది తాలిబన్లు హతం