కరోనా బాధితుల్లో మూడు విభిన్న దశలను గుర్తించారు ఇటలీ శాస్త్రవేత్తలు. ఆయా దేశాల్లోని వ్యాధి లక్షణాల ఆధారంగా ప్రత్యేకమైన చికిత్సలు అందించడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు ఫ్లారెన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు.
తొలిదశ: ఈ సమయంలో బాధితుడి శరీరంలో తన సంఖ్యను వైరస్ భారీగా పెంచుకుంటుంది. వ్యాధికి సంబంధించి స్వల్పస్థాయిలో లక్షణాలు కన్పిస్తాయి. అయితే వీటిని సాధారణ జలుబు, ఫ్లూగా పొరపడుతుంటారు.
రెండో దశ: ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన దశ. ఈ సమయంలో రోగనిరోధక వ్యవస్థపై ఇన్ఫెక్షన్ ప్రభావం గట్టిగా పడుతుంది. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వంటివి తలెత్తుతాయి. రక్తం గడ్డకట్టడం వంటివీ జరగొచ్చు.
మూడోదశ: ఇది హైపర్ ఇన్ఫ్లమేటరీ దశ. ఇందులో తీవ్రస్థాయిలో స్పందించే రోగ నిరోధక వ్యవస్థ వల్ల.. గుండె, మూత్రపిండాలు, ఇతర అవయవాలకు నష్టం కలుగుతుంది. శరీరం తన సొంత కణజాలంపైనే దాడి చేసే 'సైటో కైన్ స్టార్మ్' సమస్య తలెత్తుతుంది.
దశను బట్టి చికిత్స
కొన్ని కేసుల్లో పలుదశలు కలగలసిపోతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే విడిగా ప్రతి దశనూ గుర్తించడం చాలా ముఖ్యమని వివరించారు. తద్వారా బాధితులకు నిర్దిష్ట చికిత్సను అందించడానికి వీలవుతుందని తెలిపారు. కోలుకున్నవారి నుంచి సేకరించిన యాంటీబాడీలతో చికిత్స వల్ల తొలిదశలో ప్రయోజనం ఉంటుందని గమనించినట్లు చెప్పారు.
మొదటి దశలో వైరస్ పునరుత్పత్తిని అడ్డుకోవడంలో రెమిడెసివర్ వంటి యాంటీ వైరల్ ఔషధాలు సాయపడొచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వీటివల్ల రెండో దశలోనూ ప్రయోజనాలు ఉండొచ్చని చెప్పారు. పక్షపాత రోగులకు చికిత్స చేయడానికి వాడే 'టిష్యూ ప్లాసిమినోజెన్ యాక్టివేటర్(టీపీఏ)' వల్ల రెండో దశలోని రక్తం గడ్డకట్టే స్థితికి చికిత్స చేయవచ్చని తెలిపారు. కార్టికోస్టెరాయిడ్లు, టోసిలిజుమాబ్, సారిలుమాబ్ వంటి ఇన్ఫ్లమేషన్ నిరోధక మందుల వల్ల రెండు, మూడు దశల్లో ప్రయోజనం ఉండొచ్చన్నారు.
ఇదీ చదవండి: '3టీ వ్యూహంతోనే వైరస్‌పై విజయం'