విదేశాల్లో విహారం... విలాసవంతమైన హోటళ్లలో విడిది... ఆ మధుర స్మృతులతో ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు... కాస్త సంపన్న కుటుంబాల్లో ప్రతి వేసవి ఇలానే ఉంటుంది. ఈసారి మాత్రం కథ మారింది. కరోనా సంక్షోభంతో సెలవులన్నీ ఇంట్లోనే గడిచిపోయాయి.
కరోనా ఇలా ఎంతో మంది ఫారిన్ ట్రిప్ కలలను మాత్రమే తారుమారు చేయలేదు. పర్యటకంపైనే ప్రధానంగా ఆధారపడే ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థల్నీ దెబ్బకొట్టింది. అందుకే అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికిప్పుడు పూర్వవైభవం రాకపోయినా... కనీసం ఉనికి కాపాడుకోవడం ఎలాగా అని తీవ్ర మేధోమథనం చేస్తున్నాయి.
పర్యటక రంగాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ఇప్పటికే కొన్ని దేశాలు వినూత్న ప్రణాళికలు సిద్ధం చేశాయి. వాటిలో కొన్నింటిని ఇప్పటికే అమలు చేయడం ప్రారంభించాయి. వైరస్ భయాలు లేకుండా చేసి, డిస్కౌంట్ ఆఫర్లతో పర్యటకుల్ని ఆకర్షించడమే ఈ ప్రణాళికల్లోని ముఖ్యాంశం.
ఖర్చు మాది... ఫన్ మీది...
విహార యాత్రకు అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని ఆయా దేశాల ప్రభుత్వాలే భరిస్తున్నాయి. ఇందుకోసం 2+1 ఫార్ములాను అమలు చేస్తున్నాయి. హోటళ్లలో 2 రోజుల వసతి కోసం బుక్ చేస్తే, మూడో రోజు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ప్రస్తుతం నాలుగు దేశాలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి.
1. సైప్రస్
బ్రిటీష్ పర్యటకులను ఆకర్షించే బ్రహ్మాండమైన ద్వీప దేశం సైప్రస్. "మా సన్నీ బీచ్‌లలో సరదాగా గడుపుతున్నప్పుడు మీరు కొవిడ్-19 బారిన పడితే... మీ విహార యాత్ర ఖర్చు మొత్తం మేమే భరిస్తాం" అని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అవసరమైతే పర్యటకులను క్వారంటైన్ చేసేందుకు, చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా 100 పడకల ఆస్పత్రితో పాటు అనేక హోటళ్లను సిద్ధం చేసింది.
![These 4 destinations will pay for your travel and stay if you book your next holiday with them](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7586787_cyprus.jpg)
2. సిసిలీ
సిసిలీ... మధ్యదరా సముద్రంలోని అతిపెద్ద ఇటాలియన్ ద్వీపం. పర్యటకుల్ని ఆకట్టుకునేలా విమాన ఛార్జీలు, మ్యూజియాల టికెట్లు, హోటల్ బిల్లుపై రాయితీ ఇచ్చేందుకు 50 మిలియన్ యూరోలు కేటాయిస్తున్నట్లు మే నెలలోనే ప్రకటించింది. సిసిలీలోని హోటల్లో 3 రోజుల గది బుక్ చేసుకున్నవారికి ఓ రోజు అదనంగా ఉండేందుకు అవకాశం కల్పించింది. ఇలా రాయితీలు, వేర్వేరు ఆఫర్లకు సంబంధించి మొత్తం 4 లక్షల ఓచర్లను పర్యటకులకు ఇచ్చేందుకు సిద్ధమైంది.
![These 4 destinations will pay for your travel and stay if you book your next holiday with them](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7586787_sisily.jpg)
3. జపాన్
గతేడాదితో పోల్చుకుంటే 2020 ఏప్రిల్‌లో జపాన్‌కు సందర్శకుల రాక 99.9శాతం తగ్గింది. పర్యటకుల్ని ఆకర్షించి, ఈ నష్టాన్ని పూడ్చుకునేలా... ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వడానికి ఓ కార్యక్రమాన్ని చేపట్టింది అక్కడి ప్రభుత్వం. ఇందులో భాగంగా టూరిస్టులకు ట్రావెల్, ఫుడ్ కూపన్లు ఇవ్వనుంది.
![These 4 destinations will pay for your travel and stay if you book your next holiday with them](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7586787_japan.jpg)
4. మెక్సికో
మెక్సికోలోని ప్రముఖ పర్యటక ప్రదేశమైన క్యాంకున్లోని స్థానిక ప్రభుత్వం 2+2 ఆఫర్‌ను ప్రకటించింది. అంటే 2 రోజులు హోటల్ గది బుక్ చేస్తే... మరో 2 రోజుల కోసం బిల్‌ను ప్రభుత్వమే భరిస్తుంది. ఇదే ఆఫర్‌ను రెంటల్ కార్స్, గోల్ఫ్, స్పాలకూ వర్తించే అవకాశముంది.
![These 4 destinations will pay for your travel and stay if you book your next holiday with them](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7586787_mexico.jpg)
ఇదీ చూడండి: ఈ భారతీయ 'ప్రపంచ' అందాలకు ఫిదా అవ్వాల్సిందే!