పన్ను ఎగ్గొట్టేందుకు చీకటి ఒప్పందాలు చేసుకున్న 22 దేశాలకు చెందిన పన్ను చెల్లింపుదారులు పనామా పేపర్స్ లీక్ పుణ్యమా అని 1.2 బిలియన్ డాలర్లకు (రూ.8,160 కోట్లు) పైగా జరిమానా చెల్లించారు. బ్రిటన్-253, ఫ్రాన్స్-136, ఆస్ట్రేలియా-93 మిలియన్ డాలర్ల చొప్పున వసూలు చేశాయని, 'ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్స్ '(ఐసీఐజే) స్పష్టం చేసింది.
భారీగా పన్ను ఎగవేతలకు పాల్పడి కొందరు విదేశాల్లో అక్రమ లావాదేవీలు జరిపారు. వీరి నుంచి ఆయా ప్రభుత్వాలు భారీగా పన్నులు రాబట్టాయని ఐసీఐజే తన నివేదికలో తెలిపింది. ఈ అన్వేషణలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 100 మీడియా సంస్థలు పాల్గొన్నాయి.
"అక్రమంగా దాచిన నిధులను తిరిగి వసూలు చేయడం ద్వారా, ముఖ్యమైన ప్రభుత్వ సేవలకు నిధులు సమకూరుతాయి. 'పనామా పేపర్ల' ఉదంతం ప్రజల ప్రవర్తనపై, ధోరణిపై తీవ్ర ప్రభావం చూపుతోంది." -ఐసీఐజే
పన్నుల స్వర్గధామాల్లో..
పన్నుల స్వర్గధామంగా పేర్కొనే కొన్ని దేశాల్లో రాజకీయ నాయకులు, క్రీడాకారులు, అత్యంత ధనికులు అక్రమంగా పెట్టుబడులు పెట్టారు. ఆయా దేశాల బ్యాంకుల్లో తమ నగదును దాచుకున్నారు. ఫలితంగా స్వదేశానికి చెల్లించాల్సిన పన్నులను భారీగా ఎగ్గొట్టారు. ఈ విషయం 'పనామా పేపర్స్' లీక్ అవ్వడం ద్వారా ప్రపంచానికి తెలిసింది.
పనామా చట్ట సంస్థ మొస్సాక్ ఫోన్సెకా నుంచి భారీగా లీక్ అయిన ఈ పత్రాలను దక్షిణ జర్మన్ వార్తాపత్రిక ప్రపంచానికి తెలిపింది. ఫలితంగా అక్రమ లావాదేవీలకు పాల్పడిన తమ దేశస్థుల నుంచి జర్మనీ 183 మిలియన్ డాలర్ల విలువైన పన్నులు వసూలు చేసింది. మిగిలిన దేశాలూ అదే బాట పట్టాయి.
ఇదీ చూడండి:భారత్ ఆర్థిక వృద్ధి ఆశాజనకం: ఏడీబీ