న్యూరాన్ వ్యాధితో మరణించిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్.. కుటుంబ సభ్యులు, తనకు కావాల్సిన వారి పట్ల ఎంత బాధ్యతగా ఉండేవారో ఆయన రాసిన వీలునామా ద్వారా అర్థం అవుతుంది. తను చనిపోవడానికి 11 సంవత్సరాల ముందే ఆస్తులను పిల్లలు, మనవళ్లకు కేటాయిస్తూ వీలునామా రాశారు. అలాగే తన వద్ద సహాయకుడిగా పనిచేసిన జుడిత్ క్రోస్డెల్కూ కొంత మొత్తాన్ని ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. స్టీఫెన్ వీలునామాకు సంబంధించి లండన్‌కు చెందిన 'ద సన్' అనే వార్త పత్రిక కథనాన్ని ప్రచురించింది.
76వ ఏట కేంబ్రిడ్జిలో మరణించిన స్టీఫెన్ హాకింగ్ తన ముగ్గురు సంతానంతోపాటు ముగ్గురు మనవళ్లకు ట్రస్ట్ ఫండ్ ద్వారా 16.3 మిలియన్ పౌండ్లతో కూడిన ఓ వీలునామా రాశారు. తనకు సహాయకుడిగా ఉన్న క్రోస్డెల్కు 10వేల పౌండ్లు కేటాయించారు.
మొత్తం 13 పేజీల కలిగిన వీలునామాను 2007లో సిద్ధం చేశారు హాకింగ్. తనకు ఉన్న వ్యాధి కారణంగా వీలునామాపై సంతకానికి బదులుగా వేలిముద్ర వేసినట్లు క్రోస్‌డెల్ వెల్లడించారు. తనకు సంబంధించిన 13 గౌరవ డిగ్రీల పట్టాలు, యూఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం, కంపానియన్ ఆఫ్ ఆనర్ సహా ఇతర పురస్కారాలు, పతకాలను తన పిల్లలైన రాబర్ట్, తిమోతి, లూసీలకు సమానంగా పంచాలని అందులో పేర్కొన్నారు.
విరాళంగా వెంటిలేటర్..
కరోనా మహమ్మారితో వైద్య పరికరాల కొరత ఏర్పడిన కారణంగా స్టీఫెన్ హాకింగ్ కోసం ఉపయోగించిన వెంటిలేటర్‌ను ఇంగ్లాండ్ కేంబ్రిడ్జిలోని రాయల్ పాప్‌వర్త్ ఆస్పత్రికి విరాళంగా ఇచ్చినట్లు ఆయన కుమార్తె లూసీ తెలిపారు.