తరగతి గదిలో పిల్లలంతా సైన్సు టీచర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాసేపటికే ఆమె తరగతి గదికి వచ్చేసింది. అంతసేపూ అల్లరి చేస్తున్న పిల్లలంతా టీచర్ రూపాన్ని చూసి మొదట బెదిరిపోయారు. తర్వాత మాత్రం ఆనందించారు.
ఎందుకు అనుకుంటున్నారు? ఫోటోలో చూపించినట్టుగా మానవ శరీర నిర్మాణాన్ని వివరించడంకోసం అనాటమీ సూట్ వేసుకుని వచ్చిందా టీచర్. ఆ తర్వాత శరీరంలోని ఒక్కో భాగాన్నీ వివరించుకుంటూ వెళ్లింది. తల నుంచి కాలిబొటనవేలి వరకు శరీరంలోని ప్రతి అవయవం ఆ డ్రెస్ మీద ముద్రించి ఉన్నాయి.
15 ఏళ్లుగా ప్రయోగాలతోనే..
పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారనే ప్రయోగాత్మకంగా ఇలా అనాటమీ డ్రెస్ వేసుకుని వచ్చింది స్పెయిన్‌కు చెందిన వెరోనికా. 15 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆమె.. ఏ పాఠం చెప్పినా ప్రయోగాత్మకంగానే చెబుతుంది. ఆమె చేసిన ఈ ప్రయోగం మాత్రం సామాజిక మాధ్యమల్లో వైరల్‌గా మారిపోయి అందరినీ ఆకట్టుకుంటోంది.
అభినందనలు..
క్లాసులో వెరోనికా పాఠాలు చెబుతున్న ఫొటోలని, వీడియోలని ఆమె భర్త ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. వేలాది లైక్స్, రీట్వీట్స్‌తో ఆ పోస్టు ఆకట్టుకుంటోంది. ఈ టీచరమ్మ ప్రయోగాన్ని చాలామంది అభినందిస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఎన్ఆర్సీ అమలుకు తొలి అడుగే ఎన్పీఅర్'