కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతుంటే... ఐరోపాలో మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. స్పెయిన్‌లో మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో తాజాగా 2వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 7వేల 753మంది వైరస్ బారిన పడ్డారు. 24 గంటల వ్యవధిలో 100 మందికిపైగా మరణించారు. దీనితో మృతుల సంఖ్య 288కి చేరింది. ఈ గణాంకాలే స్పెయిన్‌లోని పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. యూరప్‌లో ఇటలీ తర్వాత అత్యధింగా ప్రభావితమైన దేశంగా స్పెయిన్ ఉంది.
ఫ్రాన్స్‌లో ఎన్నికల నిర్వహణ..
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సామూహిక కార్యక్రమాలపై ఆంక్షలు విధించినప్పటికీ.. దేశవ్యాప్తంగా మేయర్, స్థానిక ఎన్నికలను నిర్వహించింది ఫ్రాన్స్. కొత్త ఆదేశాలతో పోలింగ్ కేంద్రాలు తెరుచుకున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నడూ లేని విధంగా పారిశుద్ధ చర్యలు చేపట్టింది ప్రభుత్వం. క్యూలైన్లలో ఒక్కొక్కరి మధ్య ఒక మీటర్ దూరం ఉండేలా చూడటంతో పాటు సబ్బులు, శానిటైజర్లు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంచారు అధికారులు. ఓటింగ్ రిజిస్టర్లో సంతకం చేసేందుకు ప్రతి ఒక్కరు పెన్నులు తెచ్చుకున్నారు.
ఫ్రాన్స్‌లో ఇప్పటి వరకు 4,500 మంది కోవిడ్-19 బారిన పడ్డారు. 91 మంది ప్రాణాలు కోల్పోయారు. రెస్టారెంట్లు, మ్యూజియంలు, వ్యాపార సముదాయాలను ఇప్పటికే మూసివేసిన ప్రభుత్వం.. తాజాగా సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సులు, విమానాలను రద్దు చేసింది.
బార్సిలోనా ఒలింపిక్ స్టేడియం రూపశిల్పి..
ఇటలీలో దిగ్గజాలకు కూడా కరోనా సెగ తప్పడం లేదు. 1992లో బార్సిలోనా సమ్మర్ ఒలింపిక్ స్టేడియం రూపశిల్పి విట్టోరియా గ్రెగొట్టి(92).. కరోనాతో మరణించారు.
ఇరాన్లో 724కు మృతులు
చైనా తర్వాత కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోన్న దేశాల్లో ఇరాన్ ఒకటి. శనివారం ఒక్కరోజే 113 మంది ప్రాణాలు కోల్పోవటం వల్ల మృతుల సంఖ్య 724కు చేరింది. కొత్తగా 1,209 మందికి ఈ వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 13,939కి చేరాయి. అయితే.. పాజిటివ్ కేసుల్లో 4,590 మంది కోలుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇదీ చూడండి: వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు పాటిస్తున్న సూత్రాలివే