ఐరోపాలోని పలు దేశాల్లో కరోనా రక్కసి పంజా విసురుతోంది. స్పెయిన్లో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా రెండో వేవ్ ప్రారంభమైన క్రమంలో రోజురోజుకూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ ప్రకటించారు. ఆదివారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
" అత్యవసర చర్యల్లో భాగంగా స్థానిక అధికారుల ప్రయాణాలపైనా నిషేధం ఉంటుంది. 15 రోజుల కోసం తీసుకొచ్చిన కొత్త నియమాలను ఆరు నెలల వరకు పెంచాలని పార్లమెంటును కోరనున్నాం. ఏదైనా ప్రాంతంలో రాత్రిపూట కర్ఫ్యూ వ్యవధిని సవరించాలనుకుంటే ఒక గంట పాటు వెసులుబాటు కల్పిస్తున్నాం."
- పెడ్రో శాంచెజ్, ప్రధానమంత్రి.
అత్యవసర, వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. జిల్లాల మధ్య ప్రయాణాలపై ఆంక్షలను స్థానిక అధికారులు నిర్ణయిస్తారని తెలిపారు శాంచెజ్. కొత్త నిబంధనల్లో పబ్లిక్, ప్రైవేటు సమావేశాల్లో గరిష్ఠంగా ఆరుగురికి మాత్రమే అనుమతి ఉందని పేర్కొన్నారు. దేశంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, గత అర్ధశతాబ్దంలో ఇదే తీవ్రమైన పరిస్థితిగా తెలిపారు.
స్పెయిన్లో కరోనా ప్రారంభంలోనే పంజా విసిరింది. దాంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి కట్టడి చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ప్రస్తుతం రెండో వేవ్ ప్రారంభమైన క్రమంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి.
ఇటలీలోనూ..
ఇటలీలోనూ వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కొత్త ఆంక్షలు విధించింది ప్రభుత్వం. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో దేశ ఆరోగ్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: స్పెయిన్లో 10 లక్షలు దాటిన కరోనా కేసులు