బ్రిటన్ చరిత్రలోనే అత్యధిక కాలం సేవలందించిన రాణిగా 95 ఏళ్ల క్వీన్ ఎలిజిబెత్-2(Queen Elizabeth II ) నిలిచారు. మంచి ఆరోగ్యంతో.. అధికారంలో కొనసాగుతున్నారు. అయితే.. ఆమె మరణానంతరం చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులు ఇప్పటికే ప్రణాళికలు రచించేశారు. తాజాగా.. అధికారులు రహస్యంగా చేసిన ప్రణాళికా పత్రాలు బహిర్గతమయ్యాయి. ఎలిజిబెత్-2 బతికుండగానే.. అంత్యక్రియలకు అధికారులు ప్లాన్ చేయటమేంటని అందరు ఆశ్చర్యపోతున్నారు.
పత్రాల్లో ఏముంది?
'ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్' పేరుతో ప్రణాళికలు రచించిన పత్రాలను అమెరికాకు చెందిన 'పొలిటికో న్యూస్' సంస్థ విడుదల చేసింది. పత్రాల ప్రకారం.. రాణి మరణించిన రోజును 'డీ-డే'గా పిలుస్తారు. ఆమె మరణించాక 10 రోజుల తర్వాత అంత్యక్రియలు పూర్తి చేసేందుకు నిర్ణయించారు. అంత్యక్రియల రోజున దేశవ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటిస్తారు. దానికన్నా ముందు ఆమె కుమారుడు, ప్రిన్స్ చార్లెస్ యూకే పర్యటన చేపడతారు.
ప్రణాళిక ప్రకారం.. శవపేటిక పార్లమెంట్ భవనంలో మూడు రోజుల పాటు ఉంచుతారు. రాణి భౌతికకాయాన్ని చూసేందుకు లండన్‌కు లక్షలాది మంది ప్రజలు తరలివస్తారని అధికారులు అంచనా వేశారు. దాంతో ఆహార సమస్య, శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఇప్పుడే ఆందోళన వ్యక్తం చేశారు.
భారీ సంఖ్యలో తరలివచ్చే ప్రజలను కట్టడి చేసేందుకు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించాలని ప్లాన్‌లో పొందుపరిచారు అధికారులు. రాణి మరణానంతరం కొత్త రాజు చార్లెస్ యుకేలోని నాలుగు దేశాల్లో పర్యటిస్తారు.
నో కామెంట్..
ఈ పత్రాల లీక్‌పై బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారులు స్పందించేందుకు నిరాకరించారు.
2017లోనూ..
2017లో ది గార్డియన్ పత్రిక.. ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్‌పై ఓ ఆర్టికల్‌ను ప్రచురించింది. కొత్త రాజు చార్లెస్ ఏ విధంగా అధికారాన్ని చేపడతారనే అంశంపై భారీ వ్యాసాన్ని రాసింది.
ఇదీ చూడండి: బ్రిటన్ రాణి ఎలిజిబెత్ 'రహస్య ప్రేమ'పై దుమారం!