రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అనుచరుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాాజాగా నావల్నీ అనుచరుల్లో ఒకరైన లైబోవ్ సోబోల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నావల్నీపై జరిగిన విషప్రయోగ వివరాలను వెల్లడించిన భద్రతా అధికారి నివాసంలోకి వెళ్లేందుకు యత్నించారన్న ఆరోపణలపై సోబోల్ని అదుపులోకి తీసుకున్నారు. అపార్ట్మెంట్లోకి అక్రమంగా చొరబడిన ఆరోపణలపై 48 గంటల పాటు విచారణ చేపట్టిన అనంతరం ఆమెను అరెస్టు చేశారు. ఈ ఆరోపణలను సోబోల్ ఖండించారు.
అపార్ట్మెంట్ తలుపు బెల్ మోగించడం నిబంధనలను అతిక్రమించడమెలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. దేశంలో అవినీతి నిరోధక ఫౌండేషన్లో లైబోవ్ సోబోల్ కీలక వ్యక్తిగా ఉన్నారు. గత ఆగస్టులో విషప్రయోగానికి గురైన నావల్నీ మెరగైన చికిత్స కోసం జర్మనీలో చికిత్స తీసుకుంటున్నారు.
మరోవైపు గతవారం కోన్స్టాటిన్ కుద్రియావెత్సేవ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసు అధికారిగా పరిచయం చేసుకున్నాడని నావల్నీ తెలిపారు. ఈ మేరకు ఫోన్ సంభాషణల్ని విడుదల చేశారు. ఫోన్ చేసిన వ్యక్తే తనపై విష ప్రయోగం చేసి కప్పిపుచ్చేందుకే ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
ఖండించిన రష్యా..
రసాయన ఆయుధాలపై ప్రత్యేక శిక్షణ పొందిన ఫెడరల్ సెక్యూరిటీ ఏజెంట్లు తనని వెంబడించారని.. విష ప్రయోగం జరిగినప్పుడు దగ్గర్లోనే ఉన్నారని జర్మనీలో చికిత్స పొందుతున్న నావల్నీ తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు బృందం బెల్లింగ్కాట్ ఒక నివేదికను విడుదల చేసిన నేపథ్యంలో నావల్నీ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఆరోపణలను రష్యా అధికారులు కొట్టిపారేశారు. నావల్నీ విడుదల చేసిన ఫోన్ సంభాషణలు నకీలీవని తెలిపారు.
ఇదీ చదవండి: 2020లో ప్రపంచాన్ని కుదిపేసిన ఘటనలివే!