Russia Ukraine war: ఉక్రెయిన్‌పై యుద్ధంలో దూకుడుగా వ్యవహరిస్తున్న రష్యా.. వ్యూహాలు మారుస్తోంది. నాటో సభ్య దేశాలకు హెచ్చరికలు జారీ చేసేలా యుద్ధతంత్రం పన్నుతోంది. 19 రోజూ ఉక్రెయిన్‌పై బాంబులు, తుపాకులతో విరుచుకుపడుతున్న రష్యా.. దాడుల తీవ్రతను అంతకంతకూ పెంచుతోంది. ఈ నేపథ్యంలో తమ దేశంపై నో ఫ్లైజోన్ ప్రకటించాలని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌కు(నాటో) మరోమారు విజ్ఞప్తి చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలెన్స్కీ. లేకుంటే.. రష్యా రాకెట్లు నాటో భూభాంగపైనా పడతాయన్నారు. రష్యాను నిలవరించకుంటే.. పశ్చిమ దేశాలతో యుద్ధానికి దిగుతుందని, నార్డ్ స్ట్రీమ్2ను ఒక ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఐరోపా సమాఖ్యలో ఉక్రెయిన్ సభ్యత్వంపై చర్చల ప్రక్రియకు ప్రాధాన్యమిస్తామని ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకెల్ చెప్పినట్లు తెలిపారు జెలెన్స్కీ. ఆయనతో మాట్లాడినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం, రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు.
నాటో దేశాలను హెచ్చరిస్తూనే..
ఉక్రెయిన్‌ను అష్టదిగ్బంధం చేసి ముప్పేట దాడి చేస్తున్న రష్యాసేనలు.. పరిస్ధితులకు అనుగుణంగా యుద్ధ తంత్రాన్ని మారుస్తున్నాయి. ఇప్పటిక వరకు రాజధాని కీవ్ సహా కీలక నగరాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా దాడులు చేస్తున్న రష్యా.. తాజాగా దాని పొరుగు దేశాలకు హెచ్చరికలు పంపే లక్ష్యంతో దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌కు ఆయుధాల పరంగా సాయం చేసే దేశాలు కూడా తమ లక్ష్యమే అని రష్యా ఇప్పటికే హెచ్చరించింది. ఆదివారం ఆ దిశగానే పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమ దాడులను ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాలకు విస్తరించిన రష్యా సేనలు.. పోలండ్ సరిహద్దుకు సమీపంలో నిప్పుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో 35 మంది మరణించగా.. మరో 134 మంది గాయపడ్డారు.
అమెరికా చైనా భేటీ
ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా, చైనా దేశాలు.. రోమ్‌లో సోమవారం భేటీ కానున్నాయి. యుద్ధంపై రష్యా చేస్తున్న ప్రచారం, ఆ దేశంపై ప్రపంచ దేశాలు విధిస్తున్న ఆంక్షలు వంటి అంశాలు దీనిలో చర్చకు రానున్నాయి. అమెరికా తరఫున జాతీయ భద్రతా సలహాదారుడు జాక్ సులివన్, చైనా నుంచి విదేశాంగ విధాన సలహాదారుడు యాంగ్ జీటీ దీనికి హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అంతర్జాతీయ ఆంక్షల నుంచి రష్యాకు ఉపశమనం కల్పించేలా సహాయం చేయకూడదని చైనాను సూటిగా హెచ్చరించారు సులివన్.
నాలుగో విడత శాంతిచర్చలు
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులను ఆపే దిశగా మరోమారు శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి ఇరు దేశాలు. సోమవారం ఉదయం 10.30 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు చేపట్టనున్నట్లు స్పుత్నిక్ మీడియా తెలిపింది. మరోవైపు ఈ చర్చలు జరుగుతున్నట్లు ఉక్రెయిన్ ప్రతినిధులు సైతం ధ్రువీకరించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.
చైనా సాయం కోరిన రష్యా..
ఉక్రెయిన్‌పై దాడిని మరింత ఉద్ధృతం చేయడానికి.. ఆయుధాల సరఫరా చేయాలని చైనాను రష్యా కోరినట్లు సమాచారం. రోమ్‌లో అమెరికా, చైనా సమావేశం నేపథ్యంలో వచ్చిన ఈ వార్తలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో ముందుకు సాగడానికి ఆయుధాలు సహా.. చైనా మద్దతు రష్యా కోరినట్లు అమెరికా అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: విస్తరిస్తున్న రష్యా ప్రాబల్యం.. పుతిన్ వ్యూహంతో నాటోలో గుబులు!