Russia Ukraine Crisis: ఉక్రెయిన్, రష్యా మధ్య సైనిక పోరు భీకరంగా కొనసాగుతోంది. ఐదో రోజూ రష్యా దూసుకొస్తుండగా..ఉక్రెయిన్ ఎదురొడ్డి నిలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం రాజధాని నగరం కీవ్, ప్రధాన నగరమైన ఖర్కీవ్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఉక్రెయిన్ స్టేట్ సర్వీస్ ఆఫ్ స్పెషల్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ ఈ విషయాన్ని వెల్లడించిందని ఓ వార్త సంస్థ తెలిపింది. కీవ్‌లో వైమానిక దాడులకు సంబంధించి హెచ్చరికలు జారీ అయ్యాయని పేర్కొంది. అక్కడి ప్రజలు సమీపంలోని షెల్టర్‌లో ఆశ్రయం పొందాలని సూచనలు వచ్చినట్లు చెప్పింది. అలాగే చెర్నిహివ్‌లోని ఓ నివాస భవనంపై క్షిపణి దాడి జరిగింది. దాంతో రెండు అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయి. క్షతగాత్రుల వివరాలు మాత్రం తెలియరాలేదు.
Russia Belarus News
రష్యాకు తోడుగా బెలారస్ సైన్యం..
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా బలగాలతో బెలారస్ సైన్యం చేరే అవకాశముందని అమెరికా నిఘా అధికారులు వెల్లడించారు. సోమవారం నుంచే ఈ రెండు దేశాలు కలిసి పొరుగు దేశంపై యుద్ధాన్ని తీవ్రతరం చేయవచ్చని పేర్కొన్నారు. యుద్ధంలో రష్యాకు బెలారస్ మద్దతుగా ఉంటున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష సహకారం అందించలేదు. అయితే రష్యా, ఉక్రెయిన్ చర్చల ఫలితాలను బట్టి బెలారస్ నిర్ణయం ఉంటుందని, మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అమెరికా అధికారులు వివరించారు. అంతేగాక రష్యా దళాలను ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయని, పుతిన్ ఊహించిన దానికి విరుద్ధంగా దండయాత్ర నెమ్మదిగా సాగుతోందన్నారు.
Russia Ukraine War
352 పౌరులు మృతి..
రష్యా దాడుల్లో ఇప్పటివరకు 352 ఉక్రెయిన్ పౌరులు మృతి చెందినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి వెల్లడించారు. అందులో 14మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. మరో 116 మంది చిన్నారులు సహా మొత్తం 1,684 మంది గాయపడ్డారని వివరించారు. ఆదివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అయితే ఉక్రెయిన్ సైన్యంలో ఎంత మంది చనిపోయారనే విషయంపై మాత్రం ఆయన ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
రష్యాతో ఉద్రిక్తతల కారణంగా 3.5 లక్షల మంది చిన్నారులకు చదువు అందడం లేదని ఐరాసలో ఉక్రెయిన్ రాయబారి ఆందోళన వ్యక్తం చేశారు.
రష్యా మాత్రం ఉక్రెయిన్ బలగాలే తమ లక్ష్యమని, సాధారణ పౌరుల జోలికి వెల్లడం లేదని చెబుతోంది. ఆ దేశం కూడా సైన్యంలో ఎంతమంది మరణించారనే విషయంపై ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.
Russia Ukraine News
రేడియో ధార్మిక కేంద్రంపై క్షిపణి దాడి..
రాజధాని కీవ్‌లోని రేడియోధార్మిక వ్యర్థాల నిర్వహణ కేంద్రంపై రష్యా క్షిపణి దాడులు చేసిందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థకు(IAEA) ఉక్రెయిన్ తెలియజేసింది. అయితే శనివారం జరిగిన ఈ ఘటనలో భవనం ధ్వంసమైందా? రేడియాధార్మికత విడుదలకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు.
Russia Ukraine Conflict
రష్యాపై పోరాటానికి ఖైదీల విడుదల
దూసుకొస్తోన్న రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక నేపథ్యం ఉండి జైళ్లలో శిక్ష అనుభవిస్తోన్న వారిని, పలు నేరాల్లో అనుమానితులను విడుదల చేస్తోంది. దాంతో వారు దేశం తరఫున రష్యాపై పోరాటంలో చేరనున్నారు. ఈ విషయాన్ని నేషనల్ ప్రాజిక్యూటర్ జనరల్ కార్యాలయం ధ్రువీకరించింది.
Russia Ukraine War Crisis
అతిపెద్ద విమానం ధ్వంసం..
ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతూ.. రాజధాని కీవ్ నగరంపై పట్టు సాధించే దిశగా రష్యన్ సేనలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో కీవ్ సరిహద్దుల్లో మోహరించిన ఉన్న పుతిన్ బలగాలు.. హోస్టోమెల్ విమానాశ్రయంపై బాంబులు విసిరాయి. దీంతో అక్కడే ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఏఎన్-225 ‘మ్రియా’ ధ్వంసమైంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ట్విటర్ వేదికగా సోమవారం వెల్లడించారు. మ్రియా అంటే ఉక్రెయిన్ భాషలో ‘కల’ అని అర్థం. అయితే, దీన్ని మళ్లీ పునర్‌నిర్మిస్తామని ఉక్రెయిన్ ప్రతినబూనింది. అలాగే స్వేచ్ఛాయుత, బలమైన ప్రజాస్వామ్య ఐరోపా దేశంగా ఉక్రెయిన్‌ను నెలకొల్పాలన్న తమ కలను సైతం నిజం చేసుకుంటామని వ్యాఖ్యానించింది. మ్రియా విమానాన్ని కూల్చగలిగారు కానీ, మా కలను మాత్రం ధ్వంసం చేయలేరు అని ఉక్రెయిన్ అధికారిక ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు.
ఈ విమానాన్ని ఉక్రెయిన్‌కు చెందిన ఎరోనాటిక్స్ సంస్థ ఆంటొనోవ్ తయారు చేసింది. రష్యా దాడిపై స్పందిస్తూ.. ప్రస్తుతం ఏన్-225 పరిస్థితి ఏ దశలో ఉందో వివరించలేమని తెలిపింది. సాంకేతిక నిపుణులు పరిశీలించిన తర్వాతే దాని కండిషన్‌ను చెప్పగలమని తెలిపింది.
Russia Attack Ukraine
గూగుల్ కీలక నిర్ణయం...
మరోవైపు కీవ్ నగరంలోకి దూసుకెళ్లేందుకు యత్నిస్తున్న రష్యా బలగాలను నిలువరించేందుకుగానూ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో గూగుల్ మ్యాప్స్‌లో ఉండే కొన్ని కీలక సాధనాలను డీయాక్టివేట్ చేసింది. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితులు, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండే రద్దీకి సంబంధించిన సమాచారం తెలియకుండా చేసింది. తద్వారా రష్యా సేనల దాడుల నుంచి స్థానిక ఉక్రెయిన్ ప్రజలకు భద్రత లభిస్తుందని పేర్కొంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
మరోవైపు రోడ్లపై ఉండే ట్రాఫిక్ గుర్తులు, వివిధ ప్రాంతాలకు వెళ్లే మార్గాలను సూచించే సూచికలను సైతం స్థానిక సంస్థలు తొలగించాయి. తద్వారా రష్యన్ బలగాలకు ఎటువెళ్లాలో తెలియని గందరగోళ పరిస్థితి సృష్టించేందుకు యత్నిస్తున్నాయి.
ఇవీ చదవండి: