Russia Ukraine War updates: బాంబుల మోతతో ఉక్రెయిన్ దద్దరిల్లుతోంది. దాడులు, ప్రతిదాడులతో రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటనతో.. ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ దండెత్తింది. కీలక నగరాలపై దాడులు చేసింది. రాజధాని కీవ్ సహా.. పోర్టు సిటీలు, ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకున్నాయి.
Ukraine airbases destroyed
ఉక్రెయిన్‌లో సాధారణ ప్రజలపై, జనావాసాలపై తాము దాడులు చేయడం లేదని రష్యా మిలిటరీ ప్రకటించింది. ఉక్రెయిన్ సైనిక స్థావరాలు, ఇతర ఆస్తులనే టార్గెట్ చేసినట్లు తెలిపింది. ఆ దేశ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్‌లో సైనిక మౌలిక సదుపాయాలు.. పూర్తిగా తమ సామర్థ్యాన్ని కోల్పోయాయని పేర్కొంది. మరోవైపు, అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలిగే ఆయుధాలను ఉపయోగిస్తున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పౌరులకు ఎలాంటి హాని ఉండబోదని వివరించింది.
కాగా, సైనిక కమాండ్ స్థావరాలపై క్షిపణి దాడులు జరిగాయని ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ సలహాదారుడు ఆంటోన్ గెరాష్చెంకో వెల్లడించారు. కీవ్, ఖార్కీవ్, ద్నిప్రో నగరాల్లోని స్థావరాల లక్ష్యంగా రష్యా దాడులు చేసిందని చెప్పారు.
ఉక్రెయిన్ ప్రతిఘటన
Russian planes shot down: మరోవైపు, రష్యా దాడులకు ఉక్రెయిన్ ప్రతిఘటిస్తోంది. రష్యాకు చెందిన ఐదు విమానాలను లుహాన్స్క్ ప్రాంతంలో కూల్చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. ఓ హెలికాప్టర్‌ను సైతం నేలకూల్చినట్లు తెలిపింది.
సైన్యం చొరబాటు
తొలుత గగనతలం ద్వారా విరుచుకుపడ్డ రష్యా.. తన సైన్యాన్ని ఉక్రెయిన్‌లోకి పంపించింది. బెలారస్ నుంచి రష్యా దళాలు తమ దేశంలోకి ప్రవేశించి, దాడులకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ సరిహద్దు రక్షణ ఏజెన్సీ ప్రకటించింది. సరిహద్దు దళాలకు, రష్యా సైన్యానికి మధ్య కాల్పులు జరుగుతున్నాయని తెలిపింది. ప్రాణనష్టంపై ఇంకా స్పష్టత రాలేదని వెల్లడించింది.
మోగుతున్న సైరన్లు
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఎయిర్ రెయిడ్ సైరన్లు నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. నగరంపైకి క్షిపణులు దూసుకొచ్చే సంకేతాలనిస్తూ ముందుజాగ్రత్తగా ఇవి మోగుతున్నాయి. సైరన్ల శబ్దం వినబడగానే ప్రజలు అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లు, ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: