Russia Ukraine war: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. పుతిన్ సైనిక దళాలు సాధారణ పౌరుల పైనా కాల్పులు జరుపుతున్నారు. మానవతా కారిడార్‌కు సహకరించినట్లు చెప్పుకుంటున్న రష్యా.. ఆ మార్గం గుండా వెళ్లిన ప్రజలపై దాడులు చేసిందని ఉక్రెయిన్ నుంచి బయటపడిన శరణార్థులు చెబుతున్నారు.
Russia attack on Ukraine Hospitals
మరియుపోల్‌లోని ప్రసూతి ఆస్పత్రిపైనా రష్యా దాడులు చేసింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. అనేక మంది గర్భిణులు, చిన్నారులు శిథిలాల కింద చిక్కుకున్నారు. మరో నగరంలో రెండు ఆస్పత్రులపైనా.. బాంబు దాడులు జరిగాయి.
సామూహిక శ్మశానాలు
రష్యా దాడులకు పెద్ద సంఖ్యలో పౌరులు మృతి చెందుతున్న నేపథ్యంలో మరియుపోల్ నగరంలో శవాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. 80 ఫీట్ల లోతైన గుంతలో పదుల సంఖ్యలో శవాలను పూడ్చారు. మంగళవారం నుంచి 70 మృతదేహాలను పూడ్చారని, అందులో సగం రష్యా దాడుల్లో చనిపోయినవారివేనని అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి.
శరణర్థుల సంక్షోభం
మరోవైపు, దాడులకు భయపడి పెద్ద సంఖ్యలో పౌరులు దేశం నుంచి బయటకు వెళ్తున్నారు. 20 లక్షల మంది రాజధాని కీవ్‌ను వీడారని నగర మేయర్ విటాలి క్లిష్కో వెల్లడించారు. ఇది నగరంలోని మెట్రో ప్రాంత జనాభాలో సగమని చెప్పారు. ఆహారం, అత్యవసర సామగ్రి తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు ఇతర ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఉక్రెయిన్‌లో అంతర్గతంగా 10 లక్షల మంది గల్లంతయ్యారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది. మానవతా సంక్షోభం తీవ్రంగా ఉందని పేర్కొంది.
చర్చల్లో పురోగతి శూన్యం
మరోవైపు, రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి లభించలేదు. 24 గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించాలనే అంశంపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో చర్చించినట్లు ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రి దిమిత్రో కులేబా తెలిపారు. టర్కీలో వీరిరువురూ సమావేశమయ్యారు. మానవతా కారిడార్లు, కాల్పుల విరమణపై చర్చించినట్లు కులేబా చెప్పారు. కాల్పుల విరమణకు రష్యా సిద్ధంగా లేదని పేర్కొన్నారు. 'ఉక్రెయిన్ లొంగిపోవాలని వారు అనుకుంటున్నారు. అది జరగదు. నిర్ణయం తీసుకోగలిగే అధికారులు శాంతి చర్చల్లో లేరు. వారు(పుతిన్‌ను ఉద్దేశించి) వేరే చోట ఉన్నారు' అని అన్నారు.
కాగా, ప్రస్తుతం ఉన్న ఫ్రేమ్‌వర్క్ ప్రకారం బెలారస్లో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు.
దర్యాప్తునకు పుతిన్ డిమాండ్
రష్యా పాల్పడుతున్న యుద్ధనేరాలపై అంతర్జాతీయంగా దర్యాప్తు జరగాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పిలుపునిచ్చారు. పౌరులపై దాడులు, దురాక్రమణ వంటి అంశాలపై విచారణ జరపాలన్నారు. పోలండ్ పర్యటనలో ఉన్న కమల.. ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ డూడాతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రసూతి ఆస్పత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
విద్యార్థుల కోసం విమానాలు
ఉక్రెయిన్‌లో మిగిలిపోయిన విద్యార్థులను తీసుకొచ్చేందుకు భారత్ మూడు విమానాలను పంపనుంది. సుమీ నుంచి పోలండ్‌కు చేరుకున్న 600 మందిని తిరిగి తీసుకురానుంది. గురువారమే ఈ విమానాలు బయల్దేరనున్నాయి.
రష్యా చమురు దిగుమతులను నిషేధించాలని అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయానికి.. అమెరికా దిగువ సభ మద్దతు పలికింది. ఇందుకు సంబంధించిన శాసనానికి అనుకూలంగా ఓటేసింది.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం.. ప్రసూతి ఆసుపత్రి ధ్వంసం