Russia Ukraine War: యుద్ధ క్షేత్రంలో ఇదో కీలక మలుపు. ఓ వైపు చర్చల మంత్రం, మరోవైపు 'అణు' హెచ్చరికలు వినిపిస్తున్న అనూహ్య దృశ్యం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో ఆదివారం రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు శాంతి చర్చలు జరిపేందుకు ఉభయ పక్షాలూ ముందుకు వచ్చాయి.
అదే సమయంలో అణ్వాయుధ వినియోగానికి సంసిద్ధంగా ఉండండంటూ తమ సేనలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలు జారీ చేయడం ఓ సంచలనం. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు ఆయుధాలు ఇస్తూ ఉండడం, తమ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధిస్తుండడంతో.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న పుతిన్ ఈ తెగింపు చర్యకు పూనుకున్నారు. అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు రష్యాను దూరం చేసేలా 'స్విఫ్ట్' నుంచి ఆ దేశాన్ని బహిష్కరిస్తూ అమెరికా, ఇతర దేశాలు నిర్ణయం తీసుకోవడం, రష్యాలోకి విమానాల రాకపోకల్ని ఈయూ దేశాలు నిషేధించడం ఆయన చిర్రెత్తిపోవడానికి కారణం.
ఇదిలా ఉండగా.. రష్యా యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తోందంటూ పలు దేశాల్లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన మరింతమంది భారతీయ విద్యార్థులు సురక్షితంగా మాతృదేశానికి తరలి వెళ్లారు. తాజా పరిస్థితులపై భారత ప్రధాని నరేంద్రమోదీ సమీక్షించారు. వరసగా నాలుగో రోజూ ఉక్రెయిన్‌లో రణఘోష కొనసాగింది. ఆస్తులు, ప్రాణనష్టంపై స్పష్టత లేదు. రాజధాని కీవ్‌పై పట్టుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్న రష్యా.. ఆదివారం ఖర్కివ్ నగరంపై పంజా విసిరింది. ఎడతెగని బాంబుల మోత మోగిస్తోంది. లక్ష్యాల పేల్చివేత, విధ్వంసం కొనసాగుతున్నాయి.
ఊగిసలాట.. తర్వాత సరే
శాంతి చర్చలు జరిపేందుకు బెలారస్‌కు రావాలని ఉక్రెయిన్‌ను ఆహ్వానించిన రష్యా.. దాని కోసం ఆ దేశంలోని గోమెల్ నగరానికి తమ ప్రతినిధి బృందాన్ని కూడా పంపించింది. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం బెలారస్ తమకు ఆమోదయోగ్య ప్రదేశం కాదని ప్రకటించారు. చర్చల కోసం అక్కడికైతే వచ్చేది లేదన్నారు. తమపై దురాక్రమణకు కీలక స్థావరంగా ఆ ప్రాంతాన్నే రష్యా వాడుకుంటున్నప్పుడు అక్కడకు తామెలా వస్తామని ప్రశ్నించారు. ఇస్తాంబుల్, బాకు, బుడాపెస్ట్, వార్సా, బ్రటిస్లావా వంటి ఏ నగరమైనా తమకు ఆమోదయోగ్యమేనన్నారు. చివరకు ఇరుపక్షాల చొరవతో బెలారస్‌లోనే చర్చలు జరపడానికి మార్గం సుగమమైంది.
వీధివీధినా పోరు
ఖర్కివ్ నగరంలో ప్రవేశించిన రష్యా సేనలు.. అక్కడి సహజవాయువు పైప్‌లైన్‌ను పేల్చివేశాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పర్యావరణంపై ఇది పెను ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నాలుగో రోజూ భీకరంగా కొనసాగింది. ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే రీతిలో వ్యూహాత్మక ఓడరేవుల్ని దిగ్బంధించిన రష్యా సైనికులు క్రమంగా ముందుకు వెళ్తూ ఖర్కివ్‌లోకి రావడంతో వీధుల్లో అడుగడుగునా పోరాట దృశ్యాలు కనిపిస్తున్నాయి. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలపై ఇప్పటివరకు బాంబుల వర్షం కురిపించిన రష్యా.. ఆ తర్వాత ఈ నగరాన్ని లక్ష్యంగా చేసుకుంది. 14 లక్షల మంది ప్రజలున్న ఈ నగర శివార్లలో సేనలు కదం తొక్కుతున్నాయి. ఉక్రెయిన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఆదివారం కీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. నల్ల సముద్రం తీరాన ఉన్న ఖేర్సన్ నగరాన్ని, అజోవ్ సముద్ర తీరంలోని బెర్డయాన్స్క్ ఓడరేవును దిగ్బంధించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ రెండింటికి ఉక్రెయిన్‌తో సంబంధాలు తెగిపోయాయని తెలిపింది.
అప్రమత్తంగా ఉండాలి: పుతిన్
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అణ్వాయుధాలను ప్రయోగించడానికి రష్యా సిద్ధమవుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ క్షణమైనా రంగంలో దిగే సన్నద్ధతతో అప్రమత్తంగా ఉండాలని రష్యా అణ్వాయుధ బలగాలకు పుతిన్ ఆదివారం ఆదేశాలిచ్చారు. కొన్ని దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో పాటు దూకుడుగా ప్రకటనలు చేశాయని ఆదివారం ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. పోరాట విధుల్లోకి వెళ్లేందుకు వీలుగా తయారుగా ఉండాలని రక్షణ మంత్రిని, సైనిక బలగాల అధిపతుల్ని ఆదేశించారు. రష్యా ప్రత్యేక బలగాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఒక సందేశం విడుదల చేస్తూ.. సైన్యం విజయం సాధించాలని ఆకాంక్షించారు. సైనికుల పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఉక్రెయిన్‌ను ఓడించడానికి నిషిద్ధ రసాయన ఆయుధాలను, జీవాయుధాలను పుతిన్ వాడే ప్రమాదం ఉందని బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ హెచ్చరించారు.
ఐసీజేకు ఉక్రెయిన్ ఫిర్యాదు
రష్యా సైనిక చర్యపై అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో ఉక్రెయిన్ ఫిర్యాదు చేసింది. దురాక్రమణను సమర్థించుకోవడానికి జరుగుతున్న మారణహోమంపై తప్పుడు మాటలు చెబుతున్నందుకు రష్యాను జవాబుదారీని చేయాలని జెలెన్‌స్కీ కోరారు. సైనిక చర్యను ఉపసంహరించుకునేలా రష్యాకు ఆదేశాలు ఇవ్వడంపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పౌర ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై జరిగిన దాడులకు ఆధారాలను సేకరించి ఐసీజేకు సమర్పించనున్నట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ అంశంపై చర్చించేందుకు ఐరాస భద్రతా మండలి మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.
ఇది రష్యా ప్రభుత్వ ఉగ్రవాదం: జెలెన్‌స్కీ
"మేం దేశం కోసం, మా స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తున్నాం. ఆ హక్కు మాకుంది. గత రాత్రి నివాస ప్రాంతాలపై, పౌర సదుపాయాలపై విస్తృతంగా బాంబుల వర్షం కురిసింది. ఆక్రమణదారుల లక్ష్యం కాని ప్రాంతమంటూ దేశంలో ఏ ఒక్కటీ లేదు" అని జెలెన్‌స్కీ చెప్పారు.
రష్యా చేస్తున్న దురాక్రమణ యత్నాలను 'ప్రభుత్వ ఉగ్రవాదం'గా ఆయన అభివర్ణించారు. "అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రైబ్యునల్ తగిన దర్యాప్తు జరిపి ఐరాస భద్రత మండలి శాశ్వత సభ్య దేశాల్లో ఒకటైన రష్యాను ఆ స్థానం నుంచి తప్పించి తగిన చర్య తీసుకోవాలి. ప్రపంచం దీనిపై దృష్టిపెట్టాలి" అని డిమాండ్ చేశారు.