Russia attack Ukraine: రష్యా ముప్పేట దాడితో ఉక్రెయిన్ వణుకుతోంది. రెండ్రోజులుగా ప్రధాన నగరాలు, సైనిక స్థావరాల్ని వరుసపెట్టి హస్తగతం చేసుకుంటున్న పుతిన్ సేనలు.. ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను దాదాపు స్వాధీనం చేసుకునే స్థితికి వచ్చేశాయి. ఇక ఏ క్షణంలోనైనా కీవ్ రష్యా సైన్యం చేతుల్లోకి వెళ్లిపోవచ్చు. రష్యన్ ట్యాంకర్లు, బలగాలు శుక్రవారం తెల్లవారుజాము సమయానికే శివారు ప్రాంతాలకు చేరుకున్నాయి. కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబులు, తూటాల వర్షం కురిపించాయి. దాడులు అంతకంతకూ భీకరంగా మారి, ప్రాణనష్టం ఎక్కువవుతున్న తరుణంలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చల మాట వినిపించారు.
ఉక్రెయిన్‌తో ఉన్నతస్థాయి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. అయితే ఉక్రెయిన్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి, అక్కడ తన పాలనను స్థాపించాలన్నదే పుతిన్ లక్ష్యమని అమెరికా ఆరోపించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను భూమార్గాల్లో రొమేనియా, హంగరి సరిహద్దులకు తరలించి, అక్కడి నుంచి విమానాల్లో తీసుకొచ్చేందుకు భారత విదేశీ వ్యవహారాలశాఖ ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్‌తో పాటు జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్‌లు సిద్ధమవుతున్నాయి. పుతిన్‌తో పాటు రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌కు చెందిన ఆస్తులను స్తంభింపజేసేందుకు ఈయూ కసరత్తు చేస్తోంది.
కీవ్‌కు 5 కి.మీ.ల దూరంలోనే..
కీవ్ నగరానికి ఉత్తరాన కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే రష్యా సేనలు మోహరించాయి. రాజధానిలోని ప్రభుత్వ క్వార్టర్, కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నాయి. సిటీ సెంటర్‌లోని సబ్‌వే స్టేషన్ నుంచి బయటకు రావద్దని, ఆ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నాయని స్థానిక పోలీసులు ప్రజలను హెచ్చరించారు. రష్యా సేనలు తరుముకొస్తున్న విషయం తెలిసి.. కీవ్ వాసులు గురువారం రాత్రి పొద్దుపోయాక అండర్‌గ్రౌండ్‌కు వెళ్లి తలదాచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా భూఉపరితలంపై చోటుచేసుకున్న అతిపెద్ద యుద్ధంగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు.
రష్యా గుప్పెట్లోకి వ్యూహాత్మక విమానాశ్రయం
కీవ్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలోని హోస్టోమెల్‌లో ఉన్న అత్యంత వ్యూహాత్మక విమానాశ్రయం ఇప్పుడు రష్యా గుప్పిట్లోకి వెళ్లిపోయింది. భారీ రవాణా విమానాల రాకపోకలకు అనువైన రన్‌వే ఇక్కడ ఉండటంతో, శివారుల్లోని బలగాల్ని రాజధానికి తరలించడం ఆ దేశానికి సులువు కానుంది. తమ వాయుసేనకు చెందిన 200 హెలికాఫ్టర్లు హోస్టోమెల్‌లో దిగేందుకు చర్యలు చేపట్టినట్టు రష్యా రక్షణశాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెంకోవ్ తెలిపారు. దాడుల్లో ఉక్రెయిన్ ప్రత్యేక దళానికి చెందిన సుమారు 200 మంది మృతిచెందినట్టు ఆయన పేర్కొన్నారు. తమ సైనికులెవరూ చనిపోలేదన్నారు. ఉక్రెయిన్ రక్షణశాఖ మాత్రం.. ఇప్పటివరకూ తాము రష్యాకు చెందిన సుమారు 1000 మంది సైనికులను మట్టుబెట్టినట్టు ప్రకటించింది.
ఇవాన్‌కివ్, చెర్నిహైవ్‌ల నుంచి కీవ్‌లోకి ప్రవేశించేందుకు రష్యా సేనలు ప్రయత్నిస్తున్నాయని.. దీంతో రాజధానికి 60 కిలోమీటర్ల దూరంలో భీకర పోరు చోటుచేసుకుందని ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ సలహాదారు ఆంటోన్ గెరాష్‌చెంకో వెల్లడించారు. చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా, ఉక్రెనియన్లతో కలిసి దాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపింది. ఉక్రెయిన్‌లో తన పాలనను నెలకొల్పేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారని, రాజధాని కీవ్ రష్యా ఆధీనంలోకి వెళ్లవచ్చని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు.
మాకు సాయం చేయకుంటే.. రేపు బలయ్యేది మీరే: జెలెన్‌స్కీ
రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ దేశంపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని, తమకు సాయం అందించాలని ప్రపంచ నేతలను అభ్యర్థించారు. జెలెన్‌స్కీ రాజధానిని విడిచి వెళ్లిపోయారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన శుక్రవారం మాట్లాడారు.
"ప్రపంచ దేశాల సాయం అందుతుందని భావించాం. కానీ, అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడు మాకు సాయం చేయకుంటే.. యుద్ధం రేపు మీ తలుపు తడుతుంది. సైనిక లక్ష్యాలపైనే దాడి చేస్తున్నామని రష్యా చెబుతున్నా, ప్రజలపై విరుచుకుపడుతోంది. రష్యాకు మొదటి గురి నేనే. నేను రాజధాని విడిచి పారిపోయినట్టు వస్తున్న వార్తలు అబద్ధం. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, ప్రజలతోనే ఉంటాను. దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయే ప్రసక్తే లేదు. రష్యా తక్షణమే ఆక్రమణలు ఆపి, చర్చలకు రావాలి. నాటోలో చేరకుండా, తటస్థ పరిస్థితిని కొనసాగించే అంశాలపై చర్చించేందుకు సిద్ధం. కానీ, రష్యా దాడులు ఆపేంతవరకూ మేం పోరాడుతూనే ఉంటాం. భాగస్వామ్య దేశాలను అడుగుతున్నా. మీరు ఉక్రెయిన్‌తో ఉన్నారా? లేరా? ఉన్నామని సమాధానమిస్తే, మమ్మల్ని నాటోలోకి తీసుకోవడానికి ఎందుకు సిద్ధంగా లేరో చెప్పండి. యుద్ధంలో ఇప్పటివరకూ 137 మంది హీరోలను కోల్పోయాం. వీరిలో పదిమంది సైనిక అధికారులు ఉన్నారు"అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
మార్షల్ లాను ప్రకటించిన జెలెన్‌స్కీ, 90 రోజులపాటు పూర్తిస్థాయిలో సైన్యాన్ని సమీకరించేలా ఉత్తర్వులు జారీచేశారు. ఉక్రెయిన్ నేత శుక్రవారం వీడియో ద్వారా ఐరోపా సమాఖ్య నేతలతో మాట్లాడారని, అప్పుడాయన బంకర్ నుంచి మాట్లాడినట్టుందని స్వీడన్ ప్రధాని మగ్దలెనా ఆండర్సన్ పేర్కొన్నారు. జెలెన్‌స్కీ ఎక్కడ ఉన్నారన్నది మాత్రం తెలియరావడం లేదు.
ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం!
ఉక్రెయిన్ అధికారులతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు రష్యా ప్రకటించింది. తమ ప్రతినిధి బృందాన్ని బెలారస్‌కు పంపుతామని స్పష్టం చేసింది. జెలెన్‌స్కీ ప్రతిపాదనకు స్పందనగా.. తమ బృందాన్ని పంపేందుకు పుతిన్ అంగీకరించినట్టు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఉక్రెయిన్‌తో ఉన్నతస్థాయి చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు తెలిపారు.
తాజా పరిణామాలపై వారిద్దరూ శుక్రవారం ఫోన్‌లో చర్చించారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకొనే దిశగా చొరవ తీసుకోవాలని పుతిన్‌ను జిన్‌పింగ్ కోరారు. భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం కూడా చర్చల ప్రతిపాదన విషయాన్ని ధ్రువీకరించింది. అయితే- ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటనను ముగించి, ఆయుధాలను విడనాడాలని రష్యా షరతు పెట్టింది.
ఆక్రమించుకునే ఉద్దేశమే లేదు: సెర్గీ లావ్రోవ్
ఉక్రెయిన్‌ను నిరాయుధీకరణ చేయడమే తమ లక్ష్యమని, ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలన్న ఉద్దేశమే తమకు లేదని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు.
"ఉక్రెయిన్‌లోని ప్రభుత్వం తన సొంత ప్రజలపైనే మారణహోమానికి, అణచివేతకు పాల్పడుతోంది. కాబట్టి, దాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వంగా గుర్తించే అవకాశం కనిపించడంలేదు. ఉక్రెయిన్ ప్రజలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశమిద్దాం. అక్కడి సైనికులు శత్రుత్వాన్ని విడిచి, ప్రశాంతంగా తమ కుటుంబాల చెంతకు చేరుకోవచ్చు" అని ఆయన పేర్కొన్నారు.