Russia Ukraine talks: యుద్ధాన్ని ఆపడానికి రష్యాతో చర్చలు జరుపుతోంది ఉక్రెయిన్. ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపినా.. ఎలాంటి పురోగతి కనిపించలేదు. అయితే భీకర పోరుకు ముగింపు పలకడానికి మరో రెండురోజుల్లో మూడోసారి రష్యాతో చర్చలు జరిపాలని ఉక్రెయిన్ యోచిస్తోంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు తెలిపారు.
"రెండురోజుల్లో మరోసారి రష్యాతో చర్చలు జరుగుతాయి. వారితో మేము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం" అని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్‌ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.
గురువారం బెలారస్‌లో జరిగిన రెండో విడత చర్చల సందర్భంగా పౌరులను తరలించడానికి చేయడానికి మానవతా కారిడార్‌లను నిర్వహించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఇందులో భాగంగానే ఇరుపక్షాలు సైనిక సమస్యలు, మానవతా సమస్యలు, భవిష్యత్తులో రాజకీయ పరిష్కారంపై చర్చించాయి.
పుతిన్ దూకుడు
మరోవైపు.. ఐరోపా ఖండంలోని అతిపెద్ద అణు రియాక్టర్ అయిన జాపోరిషియాపై ఈ తెల్లవారుజామున రష్యా దళాలు దాడి చేశాయి. ఈ అణు కేంద్రంలో పేలుడు సంభవిస్తే.. అది ఐరోపాకు ముగింపు అవుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క పుతిన్ మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. తాము ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్యను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఇదివరకే వ్యాఖ్యలు చేశారు. కాగా, ఉక్రెయిన్‌ను లొంగదీసుకునే క్రమంలో రష్యా అణు పదార్థాలతో చెలగాటం ఆడటాన్ని ప్రపంచదేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.
ఇదీ చూడండి: Ukraine Crisis: 'డెడ్‌హ్యాండ్'- అణుదాడికి అత్యంత రహస్య వ్యవస్థ