Russia Ukraine conflict: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ అక్కడి పరిణామాలను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ నేపథ్యంలోనే తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలోని కాడివ్కాలో కాల్పుల మోత కలవరం రేపింది. రష్యా మద్దతు కలిగిన వేర్పాటు వాదులు, ఉక్రెయిన్ సైనికుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ఘటనలో ప్రాణనష్టం లేనప్పటికీ ఇద్దరు పౌరులకు గాయాలైనట్లు సమాచారం.
సరిహద్దు ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పట్ల ఇరుపక్షాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు మొదలుపెట్టాయి. సరిహద్దు ప్రాంతంలో గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో వేర్పాటువాదులే కాల్పులు జరిపినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. మరోవైపు ప్రభుత్వ బలగాలే తమపై కాల్పులు జరిపినట్లు వేర్పాటువాదులు ఆరోపించారు. 24 గంటల వ్యవధిలో నాలుగుసార్లు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైన్యం మోహరించిన తరుణంలో రెచ్చగొట్టే చర్యల్లో భాగంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఉక్రెయిన్ ఆక్రమణకు ఓ కారణాన్ని చూపడంతోపాటు ఆ ప్రాంతంలో మారణహోమం సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. అయితే, పొరుగు దేశంపై దాడి చేయాలని యోచిస్తున్నట్లు తమపై వచ్చిన ఆరోపణలను రష్యా ఖండించింది. సరిహద్దుల్లో మోహరించిన తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంటున్నామని.. ఇప్పటికే దాదాపు లక్షకుపైగా సైనిక సిబ్బందిని వెనక్కి రప్పించే పనిలో ఉన్నామని తెలిపింది. అయినప్పటికీ అమెరికా మాత్రం రష్యా ప్రకటనను నమ్మడం లేదు. ఇంకా వేల సంఖ్యలో రష్యా బలగాలు సరిహద్దుకు చేరుకుంటున్నట్లు ఆరోపించింది.
ఇవీ చూడండి: 'ఉక్రెయిన్ సరిహద్దుకు మరిన్ని బలగాలు.. ఏ క్షణమైనా రష్యా దాడి'