ఉత్తర అమెరికా సైనిక కూటమి(నాటో)తో ఏర్పాటు చేసిన శాశ్వత మిషన్‌ను నిలిపివేస్తున్నట్లు రష్యా (Russia NATO conflict) సంచలన ప్రకటన చేసింది. గతవారం ఎనిమిది మంది రష్యా అధికారులను నాటో బహిష్కరించడానికి ప్రతిగా ఈ నిర్ణయం (Russia NATO relations) తీసుకున్నట్లు తెలిపింది. అంతేగాక మాస్కోలోని నాటో కార్యాలయాలను మూసేస్తున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ తెలిపారు. నవంబర్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపారు.
రష్యా పట్ల నాటో (Russia NATO relations) దూకుడుగా వ్యవహరిస్తోందని లావ్రోవ్ వ్యాఖ్యానించారు. రష్యాను ముప్పుగా చూపేందుకు నాటో ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సైనిక, రాజకీయపరమైన ఉద్రిక్తతలను తగ్గించేలా సంయుక్తంగా పని చేసేందుకు ఈ కూటమి సిద్ధంగా లేదని అన్నారు. సమాన స్థాయిలో చర్చలు జరిగేందుకు సహకరించడం లేదని చెప్పారు. బెల్జియంలోని రష్యా ఎంబసీ ద్వారా వెస్టర్న్ అలయన్స్‌తో చర్చలు సాగిస్తామని వివరించారు. అవసరమైతే తమను ఈ కార్యాలయం ద్వారా సంప్రదించాలని నాటోకు సూచించారు.
సంబంధాలు అంతంతమాత్రం!
రష్యా, నాటో మధ్య సహకారం (NATO Russia news) 2014లో నిలిచిపోయింది. ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని (Crimean peninsula annexation) రష్యా తనలో కలిపేసుకున్న తర్వాత.. ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే, అత్యున్నత స్థాయిలో చర్చలు జరిపేందుకు ఇరుపక్షాలు అంగీకరించుకున్నాయి. కానీ, జరిగిన చర్చలు మాత్రం అంతంతమాత్రమే. అణు క్షిపణుల అభివృద్ధి, నాటో దేశాల గగనతలంలోకి చొరబడటం వంటి కార్యక్రమాలు కూడా.. రష్యాకు నాటోను మధ్య దూరం పెంచాయి.
ఇదీ చదవండి: చైనాతో ప్రపంచ భద్రతకు ముప్పు: నాటో