Russia Starts Pulling Diplomatic Staff: పశ్చిమ దేశాలు ఆంక్షల కొరఢా ఝుళిపిస్తున్నా రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి కొత్తగా.. అదనపు బలగాల మోహరింపును కొనసాగిస్తోంది. ఈ విషయం తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా బహిర్గతమైంది. ఉక్రెయిన్ సరిహద్దుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్‌గొరొడ్ నైరుతి ప్రాంతంలో సైనికులు, ఆయుధ వ్యవస్థలను మోహరించినట్లు ఈ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోంది. బెలారస్‌లోని మేజీ ప్రాంతంలో సైనిక వాహనాలను మోహరించినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో తమ దేశ ప్రయాజనాలు.. రక్షణను తాకట్టుపెట్టి దౌత్య చర్చలను జరపలేమని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఆ చర్చలు తమ దేశ ప్రయోజనాలు, భద్రతకు విఘాతం కలిగించేలా ఉండకూడదని.. షరతులు లేని చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఇలా చెబుతూనే.. ఉక్రెయిన్‌లోని తమ దౌత్యసిబ్బందిని మొత్తం వెనక్కి రావాలని రష్యా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రష్యా వార్తా సంస్థ టాస్ తెలిపింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రష్యా రాయబార కార్యాలయం ఉంది. ఖార్కివ్, ఒడెసా, లవీవ్‌లో కాన్సులేట్లు ఉన్నాయి. ఆయా కార్యాలయాల నుంచి తరలింపులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని టాస్ వెల్లడించింది. కీవ్‌లోని ఎంబసీ వద్ద రష్యా జెండా ఎగరడం లేదని మరో వార్తా సంస్థ ఫొటోగ్రాఫర్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించిన లక్షా 90 వేల బలగాల తగ్గింపుపై మాత్రం పుతిన్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
అమెరికాపై ప్రతీకారం..!
తమ దేశంపై అమెరికా ఆంక్షలు విధించిన వేళ రష్యా స్పందించింది. అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆ దేశ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించినట్లు.. ఓ వార్తా సంస్థ ఉటంకించింది.
ఉక్రెయిన్ కూడా అప్రమత్తం..
సరిహద్దుల్లో రష్యా దళాల దూకుడుతో.. ఉక్రెయిన్ పూర్తిగా అప్రమత్తమైంది. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ ప్రతిపాదనలకు.. ఉక్రెయిన్ భద్రత, రక్షణ మండలి ఆమోదం తెలిపింది. తమ దేశ ఉనికి ప్రమాదంలో పడితే వెనక్కి తగ్గేదే లేదని ప్రకటించిన ఉక్రెయిన్.. బలగాల మోహరింపుపై దృష్టి సారించింది. ఇటు తమ దేశ పౌరులు వెంటనే.. రష్యాను వీడాలని ఉక్రెయిన్ ఆదేశించింది.
ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలకు.. రష్యా స్వయంప్రతిపత్తి ప్రకటించిన వేళ అమెరికా, రష్యా విదేశాంగమంత్రుల మధ్య జరగాల్సిన సమావేశం రద్దైంది. ఈ మేరకు.. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో 24న జరగాల్సిన భేటీని రద్దు చేసుకుంటున్నట్లు.. అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ వెల్లడించారు. ఉక్రెయిన్ విదేశాంగమంత్రి కులేబాతో కలిసి నిర్వహించిన సంయుక్త సమావేశంలో.. స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ మొదలైందన్న బ్లింకెన్ ఇలాంటి పరిస్థితుల్లో రష్యా విదేశాంగమంత్రితో చర్చలు అర్థంలేనివని.. అభిప్రాయపడ్డారు. సమస్యకు దౌత్యపరంగా పరిష్కారం వెతికే అంశాన్ని రష్యా ఆలోచించడం లేదన్నారు.
ఉక్రెయిన్‌లోకి రష్యా బలగాలను తరలిస్తుండడంతో దీనికి ప్రతిస్పందనగా తూర్పు ఐరోపా ప్రాంతంలోకి వందలాది బలగాలను పంపనున్నట్లు కెనడా ప్రకటించింది. నాటో దళాలను బలపరిచేందుకు.. లాత్వియా సహా ఆ పరిసర ప్రాంతాల్లోకి 460 మంది సభ్యులతో కూడిన సాయుధ బలగాలు పంపుతున్నట్లు.. కెనడా ప్రధాని ట్రూడో తెలిపారు.
ఇవీ చూడండి: రష్యాలోని ప్రముఖ బ్యాంకులపై అమెరికా ఆంక్షలు
'రంగంలోకి ఉక్రెయిన్ రిజర్వ్ బలగాలు.. అవసరమైతే ప్లాన్-బీ అమలు'