'కరోనా' ఈ మూడక్షరాల పేరు ఇప్పుడు మానవాళిని వణికిస్తోంది. కంటికి కనిపించని కొవిడ్ రూపం, జగమెరిగిన దాని ప్రతాపం యావత్ ప్రపంచాన్నే కలవరపెడుతోంది. అయితే, కొవిడ్‌తో మనం పడుతున్న ఈ యాతన.. మన భవిష్యత్తు తరాలకూ తెలిపేందుకు రష్యా కళాకారులు విభిన్నంగా ప్రయత్నిస్తున్నారు. కరోనాను పోలిన కళాకృతులను సృష్టిస్తూ.. దాన్నొక వ్యాపారావకాశంగా మలుచుకుంటున్నారు.
కరోనా బంతి!
రష్యా వ్లాదిమిర్‌లోని గుస్-క్రుస్టాల్నీ అనే గ్లాస్ క్రిస్టల్ కర్మాగారంలో... కరోనా కళాకృతులు సృష్టించారు. 16వ శతాబ్దపు పీటర్ ద గ్రేట్ పాలనా కాలం నుంచి గాజు కళాఖండాలకు కేంద్రంగా ఉన్న ఈ పరిశ్రమ.. ఇప్పుడు స్ఫటికాలతో కరోనావైరస్ శకాన్ని కళ్లకు కడుతోంది.
నాణ్యమైన గాజును సంప్రదాయ పద్ధతిలో బాగా వేడి చేసి ఈ కరోనా స్ఫటిక బంతులను తయారు చేశారు. ప్రతి కరోనా బంతి.. సుమారు 5 నుంచి 6 సెంటిమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. 700-800 గ్రాముల బరువు ఉంటుంది. 20 వేరు వేరు రంగుల్లో లభిస్తున్నాయి. ప్రస్తుతం రష్యాలో ఈ కరోనా వైరస్ స్ఫటికాలకు భారీ డిమాండ్ నెలకొంది. ఫలితంగా.. మంచి వ్యాపారమూ జరుగుతుందంటున్నారు నిర్వాహకులు.
'మన పిల్లలు, వారి పిల్లలు ఈ కరోనా వైరస్ స్ఫటికాన్ని చేతిలో పట్టుకొనే ఓ రోజు వస్తుంది. ఇది భవిష్యత్తులో స్ఫటికాల మ్యూజియంలోనూ ఉండొచ్చు. తరతరాలు కరోనా కాలాన్ని తలచుకుని, అంతటి క్లిష్ట సమయంలో ప్రజలు ఎలా బతికారో తెలుసుకుని ఆశ్చర్యపోతారు. ఇది వాస్తవాన్ని స్ఫటికంలో పొందుపరచడమే."
- ఉసెన్కో, గ్లాస్ క్రిస్టల్ పరిశ్రమ నిర్వాకురాలు
మాస్క్ కమ్మలు!
ఇక మరో నగల వ్యాపారి అలెగ్జాండర్ రిజాంకోవ్ నిగనిగలాడే కరోనా నెక్లెస్ తయారు చేశాడు. కరోనా కాలంలో మనం జీవించిన ఈ చీకటి కాలానికి జ్ఞాపకంగా అనేక నగలను సృష్టించాడు. మాస్క్ ఆకారంలో చెవి దుద్దులు, ఉంగరం రూపొందించాడు.
ఇదీ చదవండి:వలస వ్యథ: సైకిళ్లు కొనేందుకు తాళి తాకట్టు!