తలలు అతుక్కుని ఉన్న అవిభక్త కవలలను శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా వేరు చేశారు ఇటలీ వైద్య నిపుణులు.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలోని ఎంబైకీలో 2018, జూన్ 29న జన్మించారు ఎర్వీనా, ప్రిఫీనాలు. తలలు అతుక్కుని పుట్టిన వీరిద్దరిని వేరు చేసి, స్వతంత్రంగా జీవించేలా చేయమని వైద్యులను కోరింది వారి తల్లి. కానీ, శస్త్రచికిత్స చేస్తే ప్రాణాలకే ప్రమాదమన్నారు డాక్టర్లు. అతికిన తలలతో బిడ్డలు పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయిందా మాతృమూర్తి. ఇటలీ రోమ్‌లోని వాటికన్స్ పీడియాట్రిక్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించి దారి చూపమని కోరింది.
ఆ తల్లి కోరిక మేరకు.. ఆసుపత్రి వైద్యులు ఎర్వీనా, ప్రిఫీనాలను రోమ్కు తరలించారు. దాదాపు రెండేళ్ల పాటు వారి కపాలాలను క్షుణ్నంగా అధ్యయనం చేశారు. అధునాతన త్రీడీ సాంకేతికతను వినియోగించి.. అరుదైన శస్త్ర చికిత్సకు పూనుకున్నారు. ఎర్వీనా, ప్రిఫీనా ప్రాణాలకు ముప్పు కలగనీయకుండా దశలవారీగా శస్త్ర చికిత్స చేసి, ఈ ఏడాది జూన్ 5న ఇద్దరి తలలను వేరు చేశారు.
ఇప్పుడు ఎర్వీనా, ప్రిఫీనాలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరికి వారే తల్లితో ఆనందంగా ఆడుకుంటున్నారు.
ఇదీ చదవండి: శునకం కనిపించలేదని కాల్పులు- ముగ్గురు మృతి