బ్రిటన్ వీసాలు మరింత ప్రియం కానున్నాయి. యూకేలో నివసించేందుకు జారీ చేసే దీర్ఘకాలిక వీసాల కోసం విధించే ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది అక్కడి ప్రభుత్వం. బ్రిటన్ ఆర్థికమంత్రి, భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ ఈ మేరకు బడ్జెట్లో ప్రతిపాదన చేశారు.
"మా జాతీయ ఆరోగ్య పథకం ద్వారా విదేశీయులు లబ్ధి పొందుతుంటారు. లబ్ధి పొందిన దానికి అనుగుణంగా వారు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఛార్జీ అమలులో ఉంది. అయితే ప్రయోజనం పొందుతున్న మేరకు వసూళ్లు లేవు. ఈ నేపథ్యంలో వీసాల జారీ సమయంలో ఆరోగ్య ఛార్జీలను 642 పౌండ్లకు పెంచాలని నిర్ణయించాం."
- రిషి సునక్, బ్రిటన్ ఆర్థికమంత్రి
విదేశీయులకు ఆరోగ్య సౌకర్యం కల్పించేందుకు ఇప్పటివరకు 400 పౌండ్లు వసూలు చేస్తుండగా తాజా నిర్ణయంతో ఇది 624కు పెరగనుంది.
అదే సమయంలో 18 ఏళ్లకంటే తక్కువ వయస్సున్న విదేశీయుల కోసం ఆరోగ్య సర్ఛార్జీల రూపంలో 470 పౌండ్లు మాత్రమే వసూలు చేయనున్నట్లు ప్రకటించింది బ్రిటన్ సర్కారు. విదేశీ విద్యార్థులకు మాత్రం ఈ మొత్తాన్ని 300 నుంచి 470కి పెంచాలని నిర్ణయించింది.
అలా అయితే కష్టమే!
పెంచిన సర్ఛార్జీలను తగ్గించేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది భారత సంతతికి చెందిన వైద్యుల బృందం(బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్-బాపియో). ప్రభుత్వ నిర్ణయం కారణంగా భారత్కు చెందిన వైద్యులు బ్రిటన్లో పనిచేసేందుకు విముఖత చూపుతారని.. తద్వారా డాక్టర్లకు కొరత ఏర్పడుతుందని వాదిస్తోంది.
డిసెంబర్ నాటి ఎన్నికల మేనిఫెస్టోలోనే వలసదారులపై సర్ఛార్జీల పెంపు ప్రతిపాదన చేసింది బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు