కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పురోగతి సాధించినట్లు పలు సంస్థలు ప్రకటించడాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ స్వాగతించారు. ఈ ప్రకటనలు ఆశాకిరణాలని పేర్కొన్నారు. టీకాలను ప్రపంచ దేశాల్లోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే మహమ్మారిని అంతమొందించడం సాధ్యమవుతుందన్నారు.
తాము అభివృద్ది చేసిన టీకాలు 95 శాతం సమర్థంగా పనిచేస్తున్నాయని ఫైజర్, మోడెర్నా సంస్థలు ఇటీవలే ప్రకటించాయి. 65ఏళ్ల పైబడిన వృద్ధుల్లోనూ టీకా సత్ఫలితాలిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ విషయంపై స్పందించారు గుటేరస్.
కరోనా వ్యాక్సిన్ అభివృద్ది, చికిత్స, ఔషధాల కోసం జీ-20 దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని గుటేరస్ పిలుపునిచ్చారు. 'యాక్సెస్ టు కొవిడ్-19 టూల్(యాక్ట్)'ను వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు.
మోడెర్నా టీకా ప్రకటన అనంతరం ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి 5 కోట్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధమవుతాయనే అంచనాలు నెలకొన్నాయి. 2021 పూర్తయ్యే వరకు మొత్తం 130 కోట్ల డోసులు ఉత్పత్తి అవుతాయని నిపుణులు భావిస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు 10 బిలియన్ డాలర్ల నిధులు మాత్రమే సమకూర్చినట్లు గుటేరస్ తెలిపారు. ఇంకా 28 బిలియన్ డాలర్లు అవసరమని చెప్పారు.