ప్రధాని నరేంద్రమోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా పలువురు విదేశీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలీ ఉన్నారు.
ఇరుదేశాల భాగస్వామ్యంలో మోదీయే కీలకం..
"70వ పడిలోకి అడుగిడుతున్న మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్. భారత్- రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మోదీ కృషిని కొనియాడారు. మోదీ నాయకత్వంలో దేశం.. సామాజిక, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాలలో మరింత విజయవంతంగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.
బ్రిటన్ ప్రధాని ఏమన్నారంటే.?
'నా మిత్రుడైన ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. త్వరలోనే నేను మిమ్మల్ని కలవాలని ఆశిస్తున్నాను.' అని మోదీతో కలిసి దిగన ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం..
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలీ.. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కాంక్షించారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము ఇరువురూ కలిసి పనిచేస్తామని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
భూటాన్ పీఎం..
భూటాన్ ప్రధాన మంత్రి లొటాయ్ షెరింగ్.. ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్ మరింత పురోగతివైపు పయనిస్తుందని కొనియాడారు. 'మీ మంచి భవిష్యత్తు కోసం భూటాన్ ప్రజలు, ప్రభుత్వం.. ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాయి' అని ట్వీట్ చేశారు షెరింగ్.
జర్మన్ ఛాన్స్లర్..
జర్మన్ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్.. మోదీకి 70వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె.. మోదీకి లేఖ రాశారు.
ఇదీ చదవండి: 70వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ