రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కరోనా టీకా తీసుకున్నారని అక్కడి అధికారులు తెలిపారు. అయితే, ఆయన బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకోలేదు. కరోనా టీకా ఎక్కడ తీసుకున్నారో కూడా అధికారులు స్పష్టత ఇవ్వలేదు. పుతిన్ షెడ్యూల్‌కు ఇబ్బంది కలగకుండా వ్యాక్సినేషన్ ఉంటుందని అంతకుముందే ఆయన ప్రతినిధి ద్మిత్రి పెస్కోవ్ తెలిపారు.
పుతిన్‌కు కెమెరాల ముందు టీకా తీసుకోవడం ఇష్టం లేదని, దాన్ని ఆయన సమర్థించరని పెస్కోవ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ స్వీకరించిన తర్వాత పుతిన్ బాగానే ఉన్నారని తెలిపారు. బుధవారం నుంచి సాధారణ కార్యకలాపాల్లో యథావిధిగా పాల్గొంటారని స్పష్టం చేశారు.
వేగం పుంజుకునేనా?
రష్యాలో కరోనా వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు 63 లక్షల మందికి మాత్రమే టీకా అందించారు. టీకా పంపిణీ రేటులో చాలా దేశాలతో పోలిస్తే వెనకబడింది. పుతిన్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దేశ ప్రజలు టీకా స్వీకరించేందుకు ముందుకొస్తారని నిపుణులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: అంతా అమెరికానే చేసింది: రష్యా