తూర్పు టర్కీలో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 22కు చేరింది. మరో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. 30మంది గల్లంతయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు... సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం అన్వేషిస్తున్నారు.
ఈశాన్య రాష్ట్రమైన ఇలాజిగ్లోని సివ్రైస్ పట్టణం కేంద్రంగా 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. 30 సెకన్లకు మించి భూమి కంపించడం వల్ల ప్రజలు నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. చలిని భరిస్తూ అక్కడే ఉండిపోయారు.
వెన్నంటే ఉంటాం: టర్కీ అధ్యక్షుడు
భూకంపం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్. ప్రమాదానికి గురైన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు స్పష్టం చేశారు. దేశంలో త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1999లో పశ్చిమ టర్కీలో 7.4 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 17వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక్క ఇస్తాంబుల్ నగరంలోనే 1000కిపైగా మంది మరణించారు.
ఇదీ చదవండి: వణుకుపుట్టించే చలిలో గుర్రపు పోటీల మజా!