అక్టోబర్ 31... ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ బయటకు వెళ్లేందుకు తుది గడువు. అయితే, ఆ తేదీలోగా ఈయూతో వాణిజ్యం, సరిహద్దు అంశాలపై ఒప్పందం కుదరని పక్షంలో ఆ గడువును పొడిగించాలని చాలామంది ఎంపీలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అక్టోబర్ 14 వరకు పార్లమెంటును నిలిపేస్తూ తీసుకున్న నిర్ణయం.. దేశవ్యాప్త ఆందోళనలకు దారితీసింది.
దాదాపు 10 వేల మంది నిరసనకారులు సెంట్రల్ లండన్‌లో ఆందోళనకు దిగారు. బ్రెగ్జిట్‌కు ఒప్పుకునేది లేదంటూ నినాదాలు చేశారు. పార్లమెంటును నిలిపేయడం ఏంటని ప్రశ్నించారు. బెల్ఫాస్ట్, యార్క్ నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి.
ఎప్పటి నుంచి..?
సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 14 వరకు పార్లమెంటు సస్పెండ్ అవుతుందని భావిస్తున్నారు. అంటే ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి యూకే బయటకు రావాల్సిన గడువుకు కేవలం 17 రోజుల ముందు నుంచి పార్లమెంటు మళ్లీ పనిచేస్తుంది.
ఎందుకు..?
బ్రెగ్జిట్ మీద ఎంపీలు నోరు విప్పకుండా చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం పార్లమెంటును నిలిపేసిందని విమర్శకులు అంటున్నారు. స్వేచ్ఛగా నడవాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రధాని నిలువరించడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ వాదన...
ఈయూతో సరైన ఒప్పందం కుదుర్చుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ప్రధాని బోరిస్ తెలిపారు. కొత్త ఎజెండాను రూపొందించేందుకే పార్లమెంటు నిలుపుదలకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
భిన్నస్వరాలు...
ప్రతిపక్ష ఎంపీలలో చాలామంది బ్రిటన్ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా, బ్రెగ్జిట్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బ్రెగ్జిట్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.
ఈయూ ససేమిరా...
ఈయూకు చెందిన ప్రధాన బ్రెగ్జిట్ రాయబారి మైఖెల్ బార్నియర్ మాత్రం బ్రెగ్జిట్ బిల్లులో ఎలాంటి మార్పు లేదని తేల్చిచెప్పారు.
ఎక్కడ మొదలైంది..?
ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ బయటకు రావాలన్న అంశంపై 2016లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అందులో 52 శాతం మంది ప్రజలు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేశారు. 48 శాతం మంది వ్యతిరేకించారు.