ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సమస్యల్లో ఆర్థిక అసమానతలు ఒకటి. కరోనా మహమ్మారి ఈ సమస్యను మరింత తీవ్రం చేసినట్లు తాజాగా విడుదల చేసిన ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. కరోనా తెచ్చిన కష్టాలు పేదలకే పరిమితమైనట్లు తేల్చిన ఈ నివేదిక.. ఏటా బిలియనీర్ల వద్ద పోగవుతున్న సంపదకు మాత్రం ఎలాంటి ముప్పు వాటిల్లలేదని కుండబద్దలు కొట్టింది. ప్రభుత్వాలు ఆర్థిక విధానాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టకపోతే అసమానతలు మరింత పెరిగి దీర్ఘకాల మహమ్మారిగా మారే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. త్వరలో జరగబోయే 'ప్రపంచ ఆర్థిక వేదిక' సదస్సు ముందు ఈ నివేదికను ఉంచనుంది.
ధనవంతుల నష్టాల బాధలు తీరిపోయాయి..
కరోనా మహమ్మారి తొలినాళ్లలో సంభవించిన నష్టాలను.. తొలి 1000 మంది ధనవంతులు ఇప్పటికే పూడ్చుకున్నట్లు నివేదిక వెల్లడించింది. స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం వారికి కలిసొచ్చిందని వివరించింది. ఇదే సమయంలో కరోనా మూలంగా పేదరికంలో జారుకొని ఉపాధిని కోల్పోయిన పేదలు తమ పూర్వ స్థితికి చేరుకోవడానికి మరో పదేళ్లు పట్టే దుస్థితి తలెత్తిందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో లోపాల కారణంగా ధనవంతుల చేతుల్లోకి సంపద సులభంగా వెళ్లిపోతోందని అభిప్రాయపడింది. బిలియనీర్లు కరోనా కష్ట కాలాన్ని విలాసవంతంగా గడపగా.. కరోనా యోధులు మాత్రం నిత్యావసరాల బిల్లుల్ని కూడా చెల్లించలేని దుస్థితికి చేరుకున్నారని ఆక్స్‌ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియెలా బుచర్ తెలిపారు.
500 బి.డా ఎగబాకిన 10 మంది సంపద..
ఫోర్బ్స్- 2020 బిలియనీర్ల జాబితాను పరిశీలించిన ఆక్స్‌ఫామ్.. జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, వారెన్ బఫెట్ సహా తొలి పది మంది బిలియనీర్ల సంపద కరోనా సంక్షోభం ప్రారంభమైన తర్వాత దాదాపు 500 బిలియన్ డాలర్లు పెరిగినట్లు తెలిపింది. మరోవైపు ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం.. పేదల సంఖ్య 2030 నాటికి 3.4 బిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. కరోనా ప్రారంభానికి ముందు కంటే ఇది అధికం కావడం గమనార్హం. మహిళలు, సాంస్కృతికంగా వెనుకబడిన జాతులు.. పేదరికం, ఆకలి, ఆరోగ్యం విషయంలో మరింత ఘోరమైన పరిస్థితుల్ని చవిచూడాల్సి రావొచ్చని అంచనా వేసింది.
ప్రభుత్వాల ముందున్న మార్గాలు..
ప్రతిఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు ఆక్స్‌ఫామ్ సూచించింది. ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థికంగా అండగా నిలవాలని హితవు పలికింది. కరోనా అంతం తర్వాత యావత్తు ప్రపంచం పేదరిక నిర్మూలనపై దృష్టి సారించాలని తెలిపింది. ప్రభుత్వ సేవల్లో భారీ పెట్టుబడులు పెట్టాలని సూచించింది. విద్య, వైద్యం, సామాజిక రక్షణ కల్పించాలని చెప్పింది. ఈ క్రమంలో పన్నుల రూపేణా ధనవంతులు ప్రభుత్వానికి చేదోడుగా ఉండాలని హితవు పలికింది.
ఇతర కీలకాంశాలు..
- ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంపద మార్చి 18 నుంచి డిసెంబరు 31, 2020 మధ్య 3.9 ట్రిలియన్ డాలర్లు పెరిగింది.
- తొలి 10 మంది బిలియనీర్లు కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి 540 బిలియన్ డాలర్ల సంపదను ఆర్జించారు.
- ఇదే సమయంలో పేదల సంఖ్య 200-500 మిలియన్లు పెరిగింది.
- ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా రోజుకి 2 డాలర్ల నుంచి 10 డాలర్లతో జీవనాన్ని నెట్టుకొస్తుంటే.. బిలియనీర్లు మాత్రం కరోనా సంక్షోభంతో విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతో ఏకంగా ప్రైవేట్ జెట్లను కొనుగోలు చేశారు.
- మహమ్మారి ప్రభావం ప్రారంభమైన తర్వాత తొలి 10 మంది బిలియనీర్ల వద్ద పోగైన సంపదతో.. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో జారుకుంటున్నవారందరినీ ఒడ్డున పడేయొచ్చు. ప్రతిఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించొచ్చు.
- కరోనా మూలంగా కొంతమంది తమ పేదరికాన్ని జీవితాంతం అనుభవించే ప్రమాదంలోకి జారుకున్నారు.
- బిలియనీర్లపై పన్నులు విధించడం ద్వారా పేదరికాన్ని రూపుమాపే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా అర్జెంటీనా ప్రపంచ దేశాలకు ఒక మార్గం చూపింది. అత్యంత ధనవంతులపై ‘సంఘీభావ సంపద పన్ను’ విధించి మూడు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుకోనుంది. దాన్ని కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చేపట్టే చర్యలకు వినియోగించనుంది.
ఇదీ చదవండి : 'దుస్తుల మీద నుంచి తాకితే లైంగిక వేధింపులు కాదు'