కరోనాతో అల్లాడిపోతున్న ప్రపంచానికి సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్‌తోనే విముక్తి లభిస్తుందని అభిప్రాయపడ్డారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. ఈ ఏడాది చివరినాటికి వైరస్‌ను నిర్మూలించే టీకాను కనిపెట్టాలని ప్రపంచ దేశాలను కోరారు. సుమారు 50 ఆఫ్రికన్ దేశాలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు గుటెరస్.
వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత వేగంగా అభివృద్ధి చేసి, అందరికీ అందుబాటులో ఉంచాలని గుటెరస్ పిలుపునిచ్చారు. ఫలితంగా లక్షలాది మంది జీవితాలతో పాటు లక్షల కోట్ల ధనాన్ని ఆదా చేయొచ్చని తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కోడానికి మార్చి 25న 2 బిలియన్ డాలర్ల విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా.. అందులో 20 శాతం సేకరించినట్లు ఆంటోనియో వెల్లడించారు.
ఆ దేశాలకు ప్రశంసలు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా 47 ఆఫ్రికన్ దేశాల్లో కరోనా పరీక్షల నిర్వహణకు ఐరాస కార్యాచరణ చేపట్టినట్లు పేర్కొన్నారు గుటెరస్. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ఆఫ్రికన్ దేశాలు చేపట్టిన ప్రయత్నాలను ప్రశంసించారు.
గేట్స్ ఫౌండేషన్ మరో అడుగు...
700 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లను సిద్ధం చేసేందుకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని కోరింది బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్. వ్యాక్సిన్, కరోనా చికిత్సా విధానాల అభివృద్ధి కోసం తమ వంతుగా మరో 150 మిలియన్ల డాలర్లను అందిస్తున్నట్లు వెల్లడించింది.
సురక్షితమైన కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి, పూర్తి స్థాయిలో పరీక్షించేందుకు 18 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ.. అన్ని దేశాల ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు టీకా తయారీ ప్రణాళికలను తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఫౌండేషన్ సారథి మార్క్ సుజ్మాన్.
వైరస్‌పై పోరాడేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో 100 మిలియన్ల డాలర్లను ప్రకటించింది ఈ సంస్థ. ఆ మొత్తానికి తాజాగా మరో 150 మిలియన్ల డాలర్లు జోడించింది.