జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా 'వాతావరణ మార్పు-పరిరక్షణ' కోసం జరిపిన చర్చా కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గైర్హాజరయ్యారు. దీనిపై బదులిస్తూ 'నేను పర్యావరణ వేత్తను. పర్యావరణం గురించి అందరి కంటే నాకే ఎక్కువ తెలుసు' అని ఆయన సెలవిచ్చారు. ప్రస్తుతం జీవకోటికి కావాల్సింది స్వచ్ఛమైన నీరు, గాలి అని అభిప్రాయపడ్డారు.
బియారిడ్జ్లో జీ-7 శిఖరాగ్ర సదస్సులో 'వాతావరణం, జీవవైవిధ్యం, మహాసముద్రాల పరిరక్షణ'పై సోమవారం సమావేశం జరిగింది. ఇందులో అమెజాన్ అడవుల్లో చెలరేగుతున్న కార్చిచ్చును నియంత్రించేందుకు, కర్బన ఉద్గారాల తగ్గింపునకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించాలని జీ-7 దేశాధినేతలు నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి ట్రంప్ గైర్హాజరైనా, ఆయన ప్రతినిధులు మాత్రం పాల్గొన్నారు.
ట్రంప్‌ను ఒప్పించాల్సిన అవసరం లేదు..
ట్రంప్ సమావేశానికి హాజరుకాకపోవడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ స్పందించారు. ట్రంప్ ఈ సదస్సు పట్ల సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు. ట్రంప్‌ను 'వాతావరణ' సదస్సుకు రప్పించేలా ఒప్పించే ప్రయత్నం మాత్రం చేయబోనని ఆయన స్పష్టం చేశారు. గతాన్ని వెనక్కు తీసుకురాలేమని మెక్రాన్ వ్యాఖ్యానించారు.
సమావేశం విఫలం..
ట్రంప్ గైర్హాజరుతో జీ-7 దేశాధినేతల సమావేశం విఫలమైందని పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అమెజాన్ కార్చిచ్చు అదుపుచేయాలని, కర్బన ఉద్గారాల తగ్గింపు నియమాలను కఠినం చేయాలని కోరుతున్నారు.
ట్రంప్.... ఓ సంశయవాది
'వాతావరణ మార్పు' అనేది చైనీయులు సృష్టించిన ఓ బూటకమని.... గతంలో ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయన ఓ సంశయవాదిగా ఉన్నారు. అందుకే ఆయన '2015 పారిస్ వాతావరణ ఒప్పందం' నుంచి అమెరికాను ఉపసంహరించాలని నిర్ణయించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా... కర్బన ఉద్గారాల తగ్గింపు యత్నాలను పూర్తిగా దెబ్బతీసింది.
20 మిలియన్ డాలర్ల సహాయం..
అమెజాన్ కార్చిచ్చును అదుపుచేయడానికి, అలాగే వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి... 20 మిలియన్ డాలర్ల ఆర్థికసాయం అందించాలని జీ-7 దేశాలు నిర్ణయించాయి.
అమెరికన్లే సాయం చేస్తారు..
సోమవారం వాతావరణ సదస్సుకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హాజరయ్యారు. వాతావరణ పరిరక్షణకు ట్రంప్ ముందుకు రాకపోయినా అమెరికన్లు మాత్రం సాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: గాంధేయవాదానికి మానస పుత్రిక 'జైపుర్ పాదం'