Omicron community transmission: ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి మొదలైంది. ఇంగ్లాండ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ సామాజికంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్ వైద్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో 336 ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 261 ఇంగ్లాండ్‌లోనే బయటపడ్డాయని చెప్పారు. స్కాట్లాండ్లో 71, వేల్స్లో నాలుగు కేసులు వెలుగులోకి వచ్చాయని వివరించారు.
Omicron variant news:
కొత్తగా నమోదైన కేసుల్లో అంతర్జాతీయ ప్రయాణాలకు ఎటువంటి సంబంధం లేనివారు కూడా ఉన్నారని బ్రిటన్ ప్రతినిధుల సభకు అందించిన నివేదికలో జావిద్ పేర్కొన్నారు. దీని ద్వారా సామాజిక వ్యాప్తి ఉందని స్పష్టమవుతోందని అన్నారు.
ఒమిక్రాన్‌ను అడ్డుకునేందుకు తాము ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదని జావిద్ స్పష్టం చేశారు. ఈ వేరియంట్ ప్రమాదకరమా? కాదా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. టీకాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేదీ స్పష్టంగా తెలీదని చెప్పారు. శాస్త్రవేత్తలు దీనిపై నిర్ధరణకు వచ్చేంత వరకు.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని అన్నారు.
Omicron variant South Africa
దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న కరోనా కేసులపై ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు వారాల వ్యవధిలో రోజువారీ కేసుల సంఖ్య ఐదు రెట్లు పెరిగిందని చెప్పారు. దేశంలో నాలుగో దశ కరోనా వ్యాప్తి ఊహించినదేనని అన్నారు. కాబట్టి ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లు ఆవిర్భవించడం అనివార్యమేనని పేర్కొన్నారు.
కొత్త వేరియంట్ గురించి పూర్తి సమాచారాన్ని ఇంకా శాస్త్రవేత్తలు కనుక్కోలేదని అన్నారు. వ్యాప్తి రేటు, వేరియంట్ అభివృద్ధి, వ్యాక్సిన్‌పై చూపే ప్రభావం వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీకాలు తీసుకోవాలని అభ్యర్థించారు. కఠినమైన లాక్డౌన్ నిబంధనల అవసరం లేకుండా చూడాలని అన్నారు.
దక్షిణాఫ్రికాలో తాజాగా 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 86,728 యాక్టివ్ కేసులు ఉన్నట్లు దక్షిణాఫ్రికా అంటువ్యాధుల సంస్థ వెల్లడించింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.
ఇదీ చదవండి: