Olena Zelenska urging first ladies: పదిరోజులుగా రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. ఇరు వైపులా ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి. అమాయక ప్రజలు నలిగిపోతున్నారు. ఈ సమయంలో ప్రపంచానికి నిజం చెప్పండంటూ ఉక్రెయిన్ ప్రథమ మహిళ వొలెనా జెలెన్‌స్కా.. ఇతర దేశాల ప్రథమ మహిళలను కోరారు. రష్యా చేపట్టింది సైనిక చర్య కాదని, పూర్తి స్థాయి యుద్ధమని.. ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాలని అభ్యర్థించారు. అలాగే ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Olena Zelenska Instagram:
- 'రష్యా చెప్పినట్లుగా ఉక్రెయిన్‌లో జరుగుతున్నది ప్రత్యేక సైనిక చర్య కాదు. అది పూర్తి స్థాయి యుద్ధం. దీని గురించి మాట్లాడండి.
- ఉక్రెయిన్ చిన్నారులు, విద్యకు దూరమవుతున్న వారి పరిస్థితి గురించి చెప్పండి.
- మీ బిడ్డలు యుద్ధ విన్యాసాల్లో పాల్గొనడం లేదు. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునే క్రమంలో మరణిస్తున్నారని రష్యన్ తల్లులకు వినిపించేలా చెప్పండి.
- ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటోంది. తనను తాను రక్షించుకుంటుంది. ఎప్పటికీ లొంగిపోదు. ఉక్రెయిన్‌ను రక్షించాల్సిన పనిలేదు. కానీ, మా ప్రజలు, సైనికులకు ఈ ప్రపంచం నుంచి సహాయం కావాలి. అది మాటల రూపంలో కాదు.
- ఈ యుద్ధం ఎక్కడో జరుగుతుందని భావించకండి. ఇది ఐరోపాలో జరుగుతోంది. ఐరోపా సరిహద్దుల్లో జరుగుతోంది. భవిష్యత్తులో మీపై దాడిచేసే శత్రువును ఉక్రెయిన్ ఎదుర్కొంటోందని చెప్పండి. పుతిన్ అణు దాడి గురించి బెదిరిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. ప్రపంచంలో సురక్షితమైన ప్రదేశం అనేదే ఉండదని చాటండి' అంటూ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.
లైవ్‌లో స్టాఫ్ అంతా రాజీనామా...
Russian TV channel staff resign: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో ఇరు దేశాల సైనికులతోపాటు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయంపై.. ఈ యుద్ధానికి సంబంధించిన వార్తలు ప్రసారం చేస్తున్న ఓ టీవీ ఛానెల్ తీవ్రంగా కలత చెందినట్లు తెలుస్తోంది. యుద్ధం వద్దంటూ ఆ సంస్థ స్టాఫ్ మొత్తం లైవ్‌లోనే రాజీనామా చేశారు.
రష్యా మీడియా సంస్థలు ఈ దాడులను కవర్ చేస్తూ.. రష్యన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వార్తలు రాస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధానికి సంబంధించిన ఎలాంటి వార్తలను కూడా ప్రచురించకూడదంటూ మీడియాపై ఆంక్షలు విధించింది. మీడియాపై ప్రభుత్వ ఆంక్షలతోపాటు, యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ 'టీవీ రెయిన్' అనే టీవీ ఛానెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఖండిస్తూ సంస్థ ఉద్యోగులు మొత్తం లైవ్ సెషన్‌లోనే రాజీనామా చేసి స్టూడియో నుంచి వాకౌట్ చేశారు. 'నో టూ వార్' అంటూ యుద్ధాన్ని వ్యతిరేకించారు. ఇదే తమ చివరి లైవ్ టెలికాస్ట్‌గా ఛానెల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నటాలియా సిందేయేవా వెల్లడించారు. యుద్ధం ముగిసిన తర్వాతే తిరిగి కార్యకలాపాలు మొదలుపెడతామని సంస్థ మరో ప్రకటనలో తెలిపింది.
ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న సైనిక పోరులో ఆంక్షల పర్వం కొనసాగుతోంది. ఈ సైనిక చర్యను ఖండిస్తూ.. పలు దిగ్గజ సంస్థలు రష్యాలో వాటి ఉత్పత్తులు, సేవలపై ఆంక్షలు విధించాయి. అయితే ఇప్పుడు రివర్స్‌లో రష్యా కూడా ఆ తరహా చర్యలే తీసుకుంది. ట్విటర్, ఫేస్‌బుక్, బీబీసీ, యాప్ స్టోర్ సేవల్ని బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి ఓ మీడియా సంస్థకు చెందిన పాత్రికేయుడు ట్వీట్ చేశారు. సైనిక పోరు గురించి ఉక్రెయిన్, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకే రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: Putin warns NATO: 'అలా చేస్తే మాతో యుద్ధానికి దిగినట్టే'