కరోనా భయంతో ప్రపంచదేశాల్లో చాలామంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇదే సమయంలో వినోదం కోసం సామాజిక మాధ్యమాలవైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఐరోపాలో ఇది అధికమైంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాల దిగ్గజాలైన నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ సంస్థలు శుక్రవారం కీలక ప్రకటన చేశాయి. ఐరోపాలో స్ట్రీమింగ్ వీడియో ఇమేజ్ క్వాలిటీని తగ్గించనున్నట్లు తెలిపాయి. ఇళ్లలో ఒంటరిగా ఉన్నవారు వినోదం, వైరస్‌కు సంబంధించిన వార్తలను కోరుకుంటున్నారని, కాబట్టి వారికి అనుగుణంగా ఇంటర్నెట్లో ఫైల్ సైజ్‌ను తగ్గించేలా.. హై డెఫినేషన్ నుంచి స్టాండర్డ్ డెఫినేషన్కు మార్చాలని యూరోపియన్ కమిషనర్ థియరీ బ్రెటన్ ఈ సంస్థలను కోరారు.
తమ సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల యూరప్‌లో సుమారు 25 శాతం ఇంటర్నెట్ ట్రాఫిక్ తగ్గుతుందని ఆశిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.
హై డెఫినేషన్తో సామర్థ్యం మందగమనం
కరోనా భయంతో యూరప్‌లో చాలా ప్రాంతాలను దిగ్బంధం చేసింది ప్రభుత్వం. దుకాణాలు, పాఠశాలలు, సరిహద్దులు మూసేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కాలక్షేపం కోసం ఇంటర్నెట్వైపు అడుగులేస్తున్నారు. ప్రముఖ సామాజిక దిగ్గజాలైన నెట్ఫ్లిక్, డిస్నీ ఫ్లస్, హెచ్‌బీఓ, అమెజాన్ వంటి సంస్థలు హై డెఫినేషన్ వీడియోలను విడుదల చేయడం వల్ల.. ఇంటర్నెట్ సామర్థ్యం మందగిస్తోందని బ్రెటన్ అభిప్రాయపడ్డారు.