రష్యా రాజకీయాల్లో కీలక నేతగా, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చిరకాల ప్రత్యర్థిగా పేరుగాంచిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీపై విషప్రయోగం జరిగిందని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ప్రస్తుతం సైబీరియాలోని ఓ ఆస్పత్రి ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.
సైబీరియాలోని టోమ్స్క్ నుంచి మాస్కోకు విమానంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా స్పృహ తప్పారు నావల్నీ. విమానాన్ని అత్యవసరంగా ఓమ్స్క్ నగరంలో ల్యాండ్ చేసి, నావల్నీని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారని ఆయన అధికారిక ప్రతినిధి కైరా యర్మిష్ తెలిపారు.
వేడి పానీయాల్లో విషపదార్థాలు కలిపితేనే ఇంత వేగంగా శరీరంపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, ఉదయం నావల్నీ తాగిన టీలోనే ఎవరో విషం కలిపి ఉంటారని, అందుకే ఇలా జరిగి ఉంటుందని ట్వీట్ చేశారు కైరా.
నావల్నీ ఆరోగ్యం ఇప్పుడు విషమంగా ఉందని స్థానిక మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.
గతంలోనూ ఓ సారి...
గతేడాది నావల్నీ రాజకీయపరమైన ఆరోపణలతో జైలుకు వెళ్లినప్పుడు ఇలాగే స్పృహ తప్పి పడిపోయారు. ఆ సమయంలో అధికారులు ఆయనపై విషప్రయోగం జరిగినట్లు అనుమానించారు. అయితే, వైద్యులు మాత్రం ఎలర్జీ వల్లే ఆయన ఆరోగ్యం దెబ్బతిందని చికిత్స చేసి మరుసటి రోజే తిరిగి జైలుకు పంపించేశారు.
2018 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కు ప్రత్యర్థిగా గట్టిపోటీనిచ్చారు నావల్నీ. అవినీతిని అంతమే లక్ష్యంగా ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అయితే ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారవేత్తల ఒత్తిడితో గత నెలలో మూసేశారు.
రష్యాలో ఎంతో మంది రాజకీయ నాయకుల్లానే.. ప్రభుత్వ అనుకూల వర్గాల చేతిలో అనేకసార్లు దాడులకు గురయ్యారు నావల్నీ. 2017లో ఆయనపై యాంటీసెప్టిక్ రసాయనాలతో కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆ ఘటనలో నావల్నీ ఓ కన్ను పోగట్టుకున్నారు.
ఇదీ చదవండి: గోల గోల చేస్తూ... 'గోల్' చేసేద్దామా...!