స్పెయిన్‌లో భారీగా మంచుకురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో అక్కడి ప్రాంతాలు శ్వేతవర్ణంలో దర్శనమిస్తున్నాయి. హిమపాతం కారణంగా అక్కడి ఇళ్లు, రోడ్లు, వాహనాలు మంచులో కూరుకుపోయాయి.
రికార్డు స్థాయిలో..
శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు.. స్పెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అక్కడి చెట్లు, రోడ్లు, కార్లు సగం మేర మంచులో కూరుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతువరకూ మంచు పేరుకుపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రికార్డు స్థాయి హిమపాతంతో అక్కడి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో మంచు తీవ్రత అధికంగా కనిపిస్తోంది.
మంచును ఆస్వాదిస్తూ..
హిమపాతానికి అతిశీతల గాలులు తోడవటంతో ప్రజలు బయటకి రాలేని పరిస్థితి. పచ్చని చెట్లన్నీ ధవళవర్ణంలోకి మారిపోగా.. భవనాలపైనా భారీస్థాయిలో పేరుకుపోయిన మంచు పలువురిని ఆకర్షిస్తోంది.
కొన్ని చోట్ల మాత్రం.. స్థానికులు మంచులో స్కేటింగ్ చేస్తూ.. మంచుగడ్డలతో ఆడుకుంటూ కనిపించారు. మరోవైపు రహదారులపై 20 సెం.మీ. మేర మంచు పేరుకుపోవటంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో వాహనాలన్నీ మాడ్రిడ్ సరిహద్దుల్లోనే చిక్కుకుపోయాయి. రంగంలోకి దిగిన స్పెయిన్ సైనిక బలగాలు యుద్ధప్రాతిపదికన రోడ్లపై పేరుకుపోయిన హిమాన్ని తొలగిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఇటలీలో అకస్మాత్తుగా ఏర్పడ్డ 66 అడుగుల గుంత