'ఉత్తినే తిని తొంగుంటే ఏటొస్తదీ!' అంటాడు బాపు తీసిన 'ముత్యాలముగ్గు' సినిమాలో రావు గోపాలరావు. ఈ మాటకు.. బ్రిటన్‌లోని ఓ కంపెనీ 'పాతిక లక్షలు వస్తాయి' అంటోంది. వీళ్లు ఇవ్వజూపుతున్న ఉద్యోగావకాశం గురించి వింటే ఎవరికైనా మతి పోవడం ఖాయం. ఈ ఉద్యోగానికి చేయవలసిందల్లా రోజుకు ఆరేడు గంటలు మెత్తటి పరుపుపై పడుకోవడం.. విసుగ్గా అనిపిస్తే అలా టీవీలో నెట్‌ఫ్లిక్స్ చూస్తూ కాలక్షేపం చేయడమే. ఇలా వారానికి 37.5 గంటలు గడపాలి. ఈ సందర్భంగా పరిశీలించిన అంశాలతో.. ఆ కంపెనీ పరుపులు ఎలా ఉన్నాయో వారానికి ఓమారు సమీక్ష నివేదిక ఇవ్వాలి. 'మ్యాట్రెస్ టెస్టర్' అని గౌరవంగా పిలిచే ఈ పనికి నెల జీతం అక్షరాలా.. రూ.24.79 లక్షలు.
అవాక్కయ్యారా!.. విలాసవంతమైన పరుపుల కంపెనీ 'క్రాఫ్టెడ్ బెడ్స్' ఈ మహత్తరమైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. 'ఆ.. ఏం వెళతాంలే! అంత దూరం ఆఫీసుకు' అనుకునే సుకుమారులకు కంపెనీ మరో గొప్ప సదుపాయం కూడా కల్పిస్తోంది. 'ఇంటి పట్టునే ఉండండి. మేమే పరుపు పంపిస్తాం. పరిశీలించిన అంశాలు నివేదిస్తే చాలు' అంటోంది. అయితే ఈ ఉద్యోగావకాశం 18 ఏళ్లు నిండి, బ్రిటిష్ పౌరసత్వం ఉన్నవాళ్లకు మాత్రమే సుమా!
ఇదీ చూడండి : రష్యాపై కరోనా పంజా- రికార్డు స్థాయిలో మరణాలు