జలుబు, దగ్గు, జ్వరం లాంటివి కరోనా వైరస్ లక్షణాల్లో భాగమని ఇప్పటికే దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే వీటితో పాటు కరోనా వచ్చినవారు వాసన, రుచి చూసే శక్తిని కోల్పోవచ్చని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. పలు దేశాల నుంచి సేకరించిన వివరాల అధ్యయనం ఆధారంగా ఈ మహమ్మారి ప్రాథమిక దశలో ఇవి కూడా భాగమై ఉండొచ్చని భావిస్తున్నారు.
ఓ వ్యక్తికి వైరస్ సోకితే వాసన చూసే సామర్థ్యాన్ని కోల్పోవడం కొత్తేమీ కాదు. శ్వాస సంబంధిత వైరస్ సోకినప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే ఇన్ఫెక్షన్ నయమైన తర్వాత వాసన చూసే స్వభావం తిరిగి వస్తుందని బ్రటిష్ రైనోలాజికల్ సొసైటీ వైద్యులు వెల్లడించారు.
'దక్షిణ కొరియా, చైనా, ఇటలీలో ఇదే అంశంపై పలు ఆధారాలు లభించాయి. కొరియాలో వైరస్ బారిన పడిన 30శాతం మందిలో ఇవే ప్రధాన సమస్యలుగా తేలింది. ఇది మినహా ఇన్ఫెక్షన్ స్వల్పంగా ఉంది. అందువల్ల కరోనా వైరస్ రోగుల్లో కనిపించే జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు లేక పోయినప్పటికీ అనుమానిత కేసులను ప్రాథమికంగా గుర్తించడానికి ఈ రుచి, వాసన పరీక్ష వీలు కల్పిస్తుంది.'
- బ్రిటిష్ రైనోలాజికల్ సొసైటీ (ముక్కు, చెవి, శ్వాస సంబంధిత డాక్టర్ల బృందం)
బ్రిటిష్ రైనోలాజికల్ సొసైటీ వెల్లడించిన అంశాన్ని అమెరికా నిపుణులు కూడా ధ్రువీకరించడం గమనార్హం.
ఇదీ చూడండి: ఆగని కరోనా ఉద్ధృతి...17వేలు దాటిన మరణాలు