విద్యుత్తు పొదుపుపై ప్రజల్లో చైతన్యం నింపడమే లక్ష్యంతో శనివారం పలు దేశాలు 'ఎర్త్ అవర్' కార్యక్రమాన్ని పాటించాయి. భవనాలు, కార్యాలయాల్లో గంట పాటు విద్యుత్ వినియోగాన్ని నిలిపివేశాయి.
రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ సహా ఇతర ప్రభుత్వ కట్టడాలు, మ్యూజియంలలో శనివారం రాత్రి 8.30 గంటల నుంచి గంట పాటు విద్యుత్ వినియోగాన్ని నిలిపివేశారు.
జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని ప్రఖ్యాత బ్రాండన్‌బర్గ్ గేట్ వద్ద పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. గంట పాటు లైట్లు ఆపి ఎర్త్ అవర్ పాటించారు.
ఎర్త్ అవర్ నేపథ్యం:
వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సంస్థ ఏటా మార్చి చివర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఒక గంట పాటు ఇళ్లల్లో, కార్యాలయ్యాల్లో విద్యుత్తు వాడకుండా ఉండి, పర్యావరణ పరిరక్షణకు మద్దతు తెలపడమే దీని ఉద్దేశం. ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు, అధికారిక భవనాలు, చారిత్రక కట్టడాలు ఎర్త్ అవర్‌లో పాల్గొని ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తాయి.
పర్యావరణ పరిరక్షణపై అవగాహనే లక్ష్యంగా 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రమేపి ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ప్రస్తుతం సుమారు 187 దేశాల్లోని 7000 నగరాల్లో ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహించి, పర్యావరణ పరిరక్షణలో తమవంతు భాగస్వామలవుతున్నారు.
ఎర్త్ అవర్ నిర్వహించే ప్రముఖ భవనాలు..
ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా చారిత్రక కట్టడాలు, అధికారిక భవనాలు వేదికగా నిలుస్తున్నాయ. సిడ్నీ ఒపెరా హౌస్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఈఫిల్ టవర్, కార్నబీ స్ట్రీట్, బకింగ్‌హామ్ ప్యాలెస్, ఎడిన్బర్గ్ కోట తదితర కట్టడాలన్నింటిలో విద్యుత్తును నిలిపివేసి ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతారు. గత పదేళ్లుగా ఈ కార్యక్రమం ఎందరిలోనో స్ఫూర్తి నింపింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యావరణ పరిరక్షణ కోసం జరిగే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. అయితే, ప్రస్తుత కరోనా సంక్షోభం కారణంగా పలు ప్రధాన దేశాల్లో ఎర్త్ అవర్‌కు సరైన ప్రాధాన్యం దక్కలేదు.
ఇదీ చదవండి: ఫలించని ప్రయత్నాలు- కదలని 'ఎవర్ గివెన్'