బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కాబోయే భార్య క్యారీ సైమండ్స్ ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా ఆ బిడ్డకు విల్ఫ్రెడ్ లౌరీ నికోలస్ జాన్సన్ అని నామకరణం చేశారు జాన్సన్. తమ పూర్వీకులు, వైరస్‌పై పోరాడటంలో బోరిస్‌కు సహాయం చేసిన వైద్యుల గౌరవార్థం వారి పేర్లు కలిసేలా నామకరణం చేశారు. ఈ విషయాన్ని సైమండ్స్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.
విల్ఫ్రెడ్ బోరిస్‌కు తాత, లౌరీ సైమండ్స్‌కు తాతా. వైరస్ సోకిన బ్రిటన్ ప్రధానికి చికిత్స చేసిన ఇద్దరు డాక్టర్ల పేర్లు డా. నిక్ ప్రైస్, డా. నిక్ హార్ట్. అందుకు నికోలస్‌ను పేరులో జత చేశారు.
బ్రిటిష్ ప్రధాని కార్యాలయంలో పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసిన తొలి జంటగా చరిత్ర సృష్టించారు బోరీస్ జాన్సన్, సైమండ్స్. బోరిస్ జాన్సన్ సారథ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి ఒకప్పుడు కమ్యూనికేషన్ చీఫ్‌గా వ్యవహరించారు సైమండ్స్. త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నారట.
ఇప్పటికే జాన్సన్ రెండో భార్య మరీనా వీలర్‌కు నలుగురు పిల్లలు. 1993లో పెళ్లి చేసుకున్న వారిద్దరూ.. 2018లో విడిపోయి వేరుగా ఉంటున్నారు. అంతకుముందు... 1987లో అలెగ్రా మోస్టిన్ ఓవెన్‌ను వివాహం చేసుకున్నారు బోరిస్. తర్వాత కొన్నేళ్లగా విడిపోయారు.