ఇటలీలో కరోనా వైరస్ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. వైరస్ ధాటికి ఆ దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ఆరోగ్య వ్యవస్థ కూడా కుప్పకూలింది. రోజుకు భారీస్థాయిలో కేసులు, మరణాలు నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటి నుంచి ఆ దేశం కోలుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా.. ఇందుకోసం ఇటలీలోని తొలి కరోనా బాధితుడు తన వంతు కృషి చేస్తున్నాడు. 180 కిలోమీటర్ల రిలే రేసులో పాల్గొని కరోనా బాధితుల్లో స్ఫూర్తి నింపుతున్నాడు.
మాటియా మైస్త్రి ఇటలీలోని కొడగ్నో వాసి. దేశంలో 'కరోనా పేషెంట్ నంబర్ 1' అతడే. ఫిబ్రవరి 21న అతడికి కరోనా సోకినట్టు నిర్ధరణ అయ్యింది. ఐసీయూలో ఎన్నో వారాల చికిత్స అనంతరం మృత్యువును జయించాడు మైస్త్రి.
తాజాగా.. వైరస్ బాధితుల జ్ఞాపకార్థం రెండు రోజుల పాటు నిర్వహించిన రిలే రేసులో పాల్గొన్నాడు మైస్త్రి. 180 కిలోమీటర్ల(112మైళ్ల) పాటు సాగిన ఈ రేసు కొడగ్నో వద్ద ప్రారంభమై వో యూగనియో వద్ద ముగిసింది. జీవించి ఉండటం ఎంతో ఆనందంగా ఉందని.. ఈ రేసులో పాల్గొనడం తన అదృష్టమని పేర్కొన్నాడు మైస్త్రి.
ఇదీ చూడండి:- శత్రు దేశానికి ఉత్తర కొరియా హెచ్చరిక.. కారణం ఇదే!