ప్రపంచంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. కంటికి కనిపించని మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 2లక్షల 6 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బాధితుల సంఖ్య 30 లక్షలకు చేరువైంది. 8 లక్షల 77 వేల మందికి పైగా వైరస్‌నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరువకాగా.. బ్రిటన్‌లో కరోనా మృతుల సంఖ్య 20వేలు దాటింది.
అమెరికాలో..
అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1330 మంది మరణించినట్లు జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ వెల్లడించింది. అమెరికాలో మృతుల సంఖ్య 55వేలు దాటగా.... వైరస్ బారిన పడిన వారి సంఖ్య 9లక్షల 87 వేలు దాటింది. దేశంలో ఇప్పటివరకు లక్షా 18 వేల 7 వందలకుపైగా కోలుకున్నారు.
కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న న్యూయార్క్‌లో గత కొంతకాలంగా నిత్యం 800కు పైగా మరణాలు సంభవించగా ఆదివారం 400 కన్నా తక్కువ మంది చనిపోయినట్టు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. ఏప్రిల్ నెలలో మరణాల సంఖ్య ఇంత తక్కువగా నమోదవటం ఇదే మొదటి సారని ఆయన చెప్పారు.
సడలింపులు..
కేసుల తీవ్రత తగ్గకున్నప్పటికీ.. జార్జియా, ఒక్లహామా, అలస్కా వంటి రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తూ ఆర్థిక కార్యకలాపాలు జరిగేలా చర్యలు చేపట్టాయి.
ఆ దేశాల్లో మరణాలు తగ్గుముఖం...
కరోనా బాధితుల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న స్పెయిన్‌లో నిన్న మరణించిన వారి సంఖ్య 5 వారాల కనిష్ఠ స్థాయికి చేరింది. గత 24 గంటల్లో 288 మంది మాత్రమే చనిపోయినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు స్పెయిన్‌లో మృతుల సంఖ్య 23 వేల 190 దాటింది. బాధితుల సంఖ్య 2 లక్షల 26వేలకు చేరింది. లక్ష 17 వేల మందికి పైగా వైరస్‌నుంచి కోలుకున్నారు.
ఫ్రాన్స్‌లో ఆదివారం మరో 242 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 22 వేల 856కు చేరగా.. బాధితులు లక్షా 62వేలకుపైమాటే.
ఇటలీలో ఇప్పటివరకు 26వేల 600మందికి పైగా చనిపోయారు. ఆ దేశంలో కేసులు లక్షా 97 వేలు దాటాయి. ఫ్రాన్స్‌లో కరోనా మహమ్మారి 22 వేల 800 మందికి పైగా బలి తీసుకుంది. కేసుల సంఖ్య లక్షా 62వేలు దాటింది. కరోనావ్యాప్తి నియంత్రణలో కొంత పురోగతి సాధించిన జర్మనీలో వైరస్ మృతుల సంఖ్య 5 వేల 976కి చేరింది. మొత్తం కేసులు లక్షా 57వేల 770కి పెరిగాయి. లక్ష 12 వేల మంది కోలుకున్నారు.
బ్రిటన్‌లో మరణాల సంఖ్య 20 వేలు దాటింది. యూకేలో మొత్తం 20వేల 732 మందికిపైగా చనిపోయారు. కేసులు లక్షా 53 వేలకు చేరువయ్యాయి.
మిగతా దేశాల్లో వైరస్ ప్రభావం...
- బెల్జియంలో మరో 177 మంది చనిపోయారు. మృతుల సంఖ్య 7వేల 94కు చేరింది.
- నెదర్లాండ్స్‌లో కొత్తగా 66మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 4 వేల 475కు చేరింది.
- రష్యాలో వరుసగా రెండో రోజు 66 మరణాలు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 747కు చేరింది. 6వేల 3వందలకుపైగా కొత్త కేసులు గుర్తించారు. రష్యాలో కేసులు 80 వేల 949కి చేరాయి.
- ఇరాన్‌లో కరోనా వైరస్ నిన్న మరో 60 మందిని బలితీసుకుంది. మృతుల సంఖ్య 5వేల 7వందలు దాటింది. మొత్తం బాధితుల సంఖ్య 90 వేల 481కి పెరిగింది.
- మెక్సికోలో నిన్న 84 మంది చనిపోయారు. ఆ దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 13 వందల 5కు చేరింది. రోగుల సంఖ‌్య 13 వేల 842గా నమోదైంది.
- బ్రెజిల్‌లో మరో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య 4 వేల 117 కి చేరింది. మొత్తం కేసులు సంఖ్య 60 వేలు దాటింది.
- ఆఫ్రికా ఖండంలోని 54 దేశాల్లో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 30 వేలు దాటింది. ఆదివారం నాటికి వెలువడిన గణాంకాల ప్రకారం మృతుల సంఖ్య 13వందల 74 గా నమోదైంది.
పాకిస్థాన్‌లో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. ఆదివారం కొత్తగా 1508 కేసులు నమోదయ్యాయి. వైరస్‌బారిన పడిన వారిసంఖ్య 13 వేల 300 దాటింది. కొవిడ్ కారణంగా పాకిస్థాన్‌లో 281 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా రంజాన్‌మాసంలో సామూహిక ప్రార్థనలకు దూరంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వ అధికారులు, వైద్య నిపుణులు విజ్ఞప్తి చేశారు. మసీదులకు వెళ్లకుండా ఇళ్లలోనే ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు.