ఇటలీ.. ప్రస్తుతం కరోనా వైరస్ ధాటికి విలవిలలాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్యలో చైనాను అధిగమించి.. ఇటలీ మొదటి స్థానానికి చేరింది. ఈ ఒక్క మాట చాలు ఇటలీని కరోనా ఎంత వణికిస్తుందో చెప్పడానికి.
యువతకూ ముప్పే..
ఇటలీలోని లాంబార్డీ రాష్ట్రంపై కరోనా అత్యధిక ప్రభావం చూపిస్తోంది. ఎక్కువగా యువతే కరోనా బారినపడి ఆస్పత్రులకు వస్తున్నట్లు ఇక్కడి వైద్యులు వెల్లడించారు. కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న ఓ వైద్యుడు పలు కీలక విషయాలు తెలిపారు.
"ఐసీయూలో ఉన్న రోగుల్లో 50 శాతం మంది 65 ఏళ్ల పైబడినవారు. అంటే మిగిలిన 50 శాతం మంది వయసు 65 ఏళ్ల లోపే. ఇక్కడ 20, 30 ఏళ్ల వయసున్న కరోనా రోగులు కూడా ఉన్నారు. వయసుపైబడిన వారితో సమానంగా వీరి పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. అయితే ఆరోగ్యం విషయంలో పెద్దవారితో పోల్చినప్పుడు సాధారణంగా వీరు బయటపడేందుకు అవకాశాలు ఎక్కువ." - అంటోనియో పెసెంటీ, వైద్యుడు
4 వేలు దాటేసింది...
ఇప్పటికే ఈ మహమ్మారి వల్ల ఇటలీలో 4 వేలకుపైగా మృతి చెందారు. కేవలం 6 కోట్ల జనాభా కలిగిన ఇటలీలో మృతుల సంఖ్య ఇంత పెద్ద ఎత్తున ఉండటం ఆ దేశాన్ని కలవరపెడుతోంది.
కారణమిదే!
ఇటలీలో ముసలివారి సంఖ్య ఎక్కువ. మిగతా దేశాలతో పోలిస్తే మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి ఇదే కారణమని వైద్యులు భావిస్తున్నారు. అయితే 20, 30 ఏళ్ల వయసున్న వారూ అంతే ప్రమాదంలో ఉన్నారని వైద్యులు చెప్పడం ఆందోళనకరం.
"వైరస్ను నియంత్రించాలి.. అప్పుడే ప్రజలు సురక్షితం. లేకపోతే ఎలాంటి శరీర వ్యవస్థనైనా ఈ వైరస్ 2-3 రోజుల్లో నాశనం చేస్తుంది." - అంటోనియో పెసెంటీ, వైద్యుడు
వైరస్ ప్రభావం...
కరోనా సోకిన చాలామందికి జ్వరం, దగ్గు వంటి మోస్తరు లక్షణాలు మాత్రమే బయటపడుతున్నాయి. అయితే ముఖ్యంగా వయసుపైబడినవారికి మాత్రం ఉన్న రోగాలతో పాటు వైరస్ వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం, మోస్తరు లక్షణాలు ఉన్నవారు 2 వారాల్లోపు వైరస్ నుంచి కోలకుంటున్నారు. తీవ్ర అనారోగ్యం ఉన్నవారు బయటపడటానికి 3 నుంచి 6 వారాలు పడుతుంది.
ఇదీ చూడండి: చైనాలో మూడో రోజూ కరోనా కేసులు సున్నా