తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, అనవసర ఆరోపణలు చేసే పాకిస్థాన్‌కు భారత్ దీటైన సమాధానం ఇచ్చింది. జెనీవా వేదికగా జరిగిన యూఎన్హెచ్ఆర్సీ సమావేశంలో పాక్‌పై విరుచుకుపడింది. ఉగ్రవాదులను పోషిస్తున్నందుకు బాధ్యులను చేస్తూ పాక్‌పై చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం అతి పెద్ద మానవ హక్కుల ఉల్లంఘన అని.. దీనిని ఎదుర్కోవడానికి కఠిన చర్యలు చేపట్టాలని సూచించింది. యూఎన్హెచ్ఆర్సీ సమావేశాల సందర్భంగా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం సహా భారత్‌పై పలు ఆరోపణలు చేసింది పాకిస్థాన్. దీనికి బదులుగా భారత్ ఈ విధంగా స్పందించింది.
ఉగ్రవాదులకు పింఛన్లు..
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్థాన్.. ముష్కరులకు ఆశ్రయం ఇవ్వడమే కాక వారికి పింఛన్లు కూడా అందిస్తోందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
"పాకిస్థాన్.. తన విధానాల్లో భాగంగా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ వారికి పింఛన్లు అందిస్తోంది. ఈ చర్యలకు బాధ్యులను చేస్తూ పాక్‌పై చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చింది. భారత్‌పై అనవసర ఆరోపణలు చేస్తూ యూఎన్హెచ్ఆర్సీ వేదికను పాక్ మరోసారి దుర్వినియోగం చేసుకుంది. పాకిస్థాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చుకునేందుకే పాక్.. భారత్‌పై ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోంది."
-పవన్ కుమార్ బధే, భారత ప్రతినిధి
ఉగ్రవాదం ఒక్కటే కాదు..
పాకిస్థాన్‌లో మైనారిటీల దుస్థితికి ఆ దేశంలో ఏటేటా తగ్గుతూ వస్తున్న వారి గణాంకాలే ఉదాహరణ అని భారత్ పేర్కొంది. బలవంతపు మత మార్పిడిలు అక్కడ సర్వసాధారణం అయిపోయాయని ఆరోపించింది. 'మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలను అపహరించడం, అత్యాచారానికి పాల్పడటం, బలవంతంగా మతం మార్పించడం సహా వివాహాలు జరిపిస్తున్న ఘటనలపై ఎన్నో నివేదికలు వెలుగులోకివచ్చాయి. ఇలా ఏటా 1000కి పైగా బాలికలను మతం మారుస్తున్నారు' అని తెలిపింది.
'జర్నలిస్టులకు ప్రమాదకరమైన దేశం'
విలేకరులకు పాకిస్థాన్ ప్రమాదకరమైన దేశం అని భారత్ అభివర్ణించింది. జర్నలిస్టులపై ఆ దేశం బెదిరింపులకు, అపహరణలకు పాల్పడటం సహా పలువురిని హత్య కూడా చేసిందని దుయ్యబట్టింది. పాలనా వ్యవస్థపై వస్తున్న విమర్శలను అణచివేసేందుకు ఈ చర్యలు చేపడుతోందని ఆరోపించింది. విద్యార్థులు, రాజకీయ కార్యకర్తలు, మానవ హక్కుల సంరక్షకుల పరిస్థితి కూడా ఇంతే అని పేర్కొంది.
అంతకుముందు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మానహ హక్కుల సంరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని భారత్ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు చర్యలు చేపడుతున్నామని వెల్లడించింది. అణగారిన వర్గాలకు ఉన్న వసతులను మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, సామాజిక రక్షణ మొదలైన అంశాలపై దృష్టి సారించామని పేర్కొంది.
ఇవీ చదవండి :