కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి-గవికి 15 మిలియన్ల డాలర్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు గురువారం హామీ ఇచ్చింది. ఈ మేరకు వర్చువల్ గ్లోబల్ వ్యాక్సిన్ సమావేశంలో ప్రధాన మంత్రి వెల్లడించారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్వహించిన ఈ సమావేశంలో.. ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లో భారత్ ప్రపంచానికి తోడుగా నిలుస్తుందని మోదీ తన ప్రసంగంలో వివరించారు. ఇతరులకు సాయం చేయడం ద్వారా మనకు మనం సాయం చేసుకున్నట్లేనని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమంలో 50 దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్తలు, ఐరాస ప్రతినిధులు, పలు దేశాధినేతలు పాల్గొన్నారు.
ప్రపంచమంతా ఒకే కుటుంబం...
భారత్‌లో కోట్ల జనాభాతో పాటు పరిమితమైన ఆరోగ్య సదుపాయాలు ఉన్నాయని మోదీ అన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ అవసరం ఎంతో ఉందని ఉద్ఘాటించారు. ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా చూడటం భారతదేశ నాగరికత నేర్పే పాఠాలని, మహమ్మారి సమయంలో ఆ విధంగానే కలిసికట్టుగా ఉండేందుకు భారత్ ప్రయత్నించిందని మోదీ వెల్లడించారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు బోరిస్ జాన్సన్‌కు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని.