కొవిడ్ నియంత్రణలో భాగంగా రోగనిరోధక శక్తిని పెంచేందుకు.. హెర్డ్ ఇమ్యునిటీకి ప్రయత్నించడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. హెర్డ్ ఇమ్యునిటీపై భిన్నవాదనలు వస్తున్న వేళ.. 80మంది శాస్త్రవేత్తల బృందం ఈమేరకు రాసిన లేఖ లాన్సెట్ జర్నల్లో ప్రచురించారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో.. రెండోసారి వ్యాప్తిచెందుతున్న వైరస్‌ను అరికట్టేందుకు కొన్ని చోట్ల హెర్డ్ ఇమ్యునిటీకి ప్రయత్నించాలనే వాదనలు వినిపిస్తున్న వేళ.. ఈ ఆలోచన సరైనది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. నిర్దిష్ట ప్రాంతంలో సహజ సంక్రమణం సాధ్యంకాదని.. లేఖలో పేర్కొన్నారు.
మహమ్మారి నియంత్రణకు ప్రత్యేక ప్రయత్నాలు తప్పనిసరన్నశాస్త్రవేత్తలు.. అందుకోసం స్వల్పకాలిక ఆంక్షలు అవసరమవుతాయన్నారు. సమర్థవంతగా పరీక్షల నిర్వహణ, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ సహా పలు విధానాల ద్వారా.. వైరస్‌ను నియంత్రించవచ్చన్నారు. రోగనిరోధక శక్తిని పెంచేందుకు హెర్డ్ ఇమ్యునిటీని ప్రయత్నిస్తే.. మహమ్మారి ప్రభావం చాలా ఏళ్లపాటు నిలిచి ఉంటుందన్న శాస్త్రవేత్తలు, భవిష్యత్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. టీకా వచ్చే వరకు వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని సూచించారు.
'అందులో అర్థం లేదు..'
విద్యావ్యవస్థ, వ్యాపారాలను పునరుద్ధరించేందుకు హెర్డ్ ఇమ్యునిటీని అమెరికా శ్వేతసౌధం అస్త్రంగా ఉపయోగించుకుంటున్న తరుణంలో.. ఈ విధానంపై విమర్శలు చేశారు ప్రముఖ అంటువ్యాధుల విభాగం చీఫ్ ఫౌచి. దాదాపు అందరు వైరస్ బారిన పడిన అనంతరం వ్యాధి సోకడం తగ్గుతుందన్న సిద్ధాంతానికి మద్దతివ్వడం అర్థం లేని విషయమన్నారు.
ఇదీ చూడండి:- కరోనా కుటుంబం నుంచి మరో వైరస్- ఇదీ చైనా నుంచే!