ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు లక్షల మంది వైరస్ బారిన పడుతున్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏకంగా 4.39 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.91 కోట్లు దాటింది. అమెరికా, భారత్, రష్యాతోపాటు అర్జెంటీనా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో వైరస్ వేగంగా విజృంభిస్తోంది.
మొత్తం కేసులు: 39,169,360
మరణాలు: 1,102,913
కోలుకున్నవారు: 29,377,465
యాక్టివ్ కేసులు: 8,688,982
- అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్ విలయం కొనసాగుతూనే ఉంది. గురువారం కొత్తగా 66 వేల మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 82 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 2.22 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో 29 వేల కేసులు వచ్చాయి. 713 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52 లక్షలకు చేరువకాగా.. మరణాలు 1.52 లక్షలు దాటాయి.
- అర్జెంటీనాలో కరోనా రక్కసి వేగంగా వ్యాప్తి చెందుతూ.. అగ్ర దేశాల సరసన నిలిచేలా చేస్తోంది. కేసుల పరంగా ఆరో స్థానానికి చేరుకుంది. కొత్తగా 17,096 మందికి వైరస్ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 9.50 లక్షలకు చేరువైంది.
- ఫ్రాన్స్‌లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 30,621 కేసులు రాగా.. ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికమని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. 33 వేల మందికి పైగా మరణించారు.
- ఇరాన్లో కరోనా విలయంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. రాజధాని టెహ్రాన్‌లో ఐసీయూ పడకలు లేక ఇబ్బందులు తలెత్తాయి. మరణాల పరంగానూ కొత్త రికార్డును నమోదవుతుండగా.. శ్మశానవాటికల్లోనూ రద్దీ ఏర్పడింది. మధ్యప్రాచ్యంలోనే మరణాల పరంగా 29,600తో తొలిస్థానంలో ఉంది ఇరాన్. మొత్తం కేసుల సంఖ్య 5.17 లక్షలు దాటింది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసుల వివరాలు ఇలా..
దేశం | మొత్తం కేసులు | మరణాలు |
అమెరికా | 8,216,315 | 222,717 |
బ్రెజిల్ | 5,170,996 | 152,513 |
రష్యా | 1,354,163 | 23,491 |
స్పెయిన్ | 972,958 | 33,553 |
అర్జెంటీనా | 949,063 | 25,342 |
కొలంబియా | 936,982 | 28,457 |
పెరు | 859,740 | 33,577 |
మెక్సికో | 834,910 | 85,285 |
ఫ్రాన్స్ | 809,684 | 33,125 |