ప్రపంచదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో తలమునకలై ఉన్నారు వైద్య నిపుణులు. దీనిని కనిపెట్టేందుకు ఎంతలేదన్నా కనీసం 6నెలలు పడుతుంది. ఈలోగా వైరస్ బారి నుంచి బయటపడేందుకు వైద్య ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నాయి పలు దేశాలు. ఈ దిశగా ఫ్రాన్స్ ముందడుగు వేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి రక్తంలోని ప్లాస్మాను.. వైరస్ వల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్న రోగి రక్తంలోకి పంపాలని భావిస్తోంది. మంగళవారం ఈ పరీక్షను మొదలుపెట్టనున్నట్లు ఫ్రాన్స్ వైద్య పరిశోధకులు తెలిపారు.
రోగ నిరోధకాల మార్పిడి..
కరోనాపై పోరాడాలంటే రక్తంలోని రోగ నిరోధకాలు అత్యంత కీలకం. వ్యాధి కారకాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని ఇవే నాశనం చేస్తాయి. ఒక వ్యక్తిలోని రోగ నిరోధకాలను మరో రోగికి పంపిస్తే... ఆ వ్యక్తి శరీరంలోనూ రోగ నిరోధకాలు జనించి వ్యాధి కారకాలపై పోరాడతాయి. ఈ విధానం ద్వారా వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాను కొంత కట్టడి చేయవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
ఈ ప్రయోగాన్ని పారిస్ ఆస్పత్రిలోని 60మంది కరోనా రోగులపై నిర్వహించనున్నట్లు ఫ్రాన్స్ వైద్యాధికారులు చెప్పారు. వీరిలో సగం మందికి కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల రక్తంలోని ప్లాస్మాను పంపించనున్నట్లు వివరించారు. ప్రయోగ ఫలితాలు తెలిసేందుకు రెండు నుంచి మూడు వారాలు పడుతుందని పేర్కొన్నారు.
ఇది తొలిసారి కాదు..
బ్లడ్ ప్లాస్మా ప్రయోగాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఎబోలా, సార్స్ వంటి అంటు రోగాలు విజృంభించినప్పుడు ఈ విధానాన్ని అవలంబించి సత్ఫలితాలు పొందారు. ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు.
కరోనా నుంచి తాత్కాలికంగా బయటపడేందుకు అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ ప్రయోగాన్ని ఇప్పటికే ప్రారంభించింది.